శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌పై బెయిలబుల్‌ వారెంటు

శివసేన పార్లమెంట్‌ సభ్యుడు సంజయ్‌రౌత్‌పై ముంబయిలోని సేవరీ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు సోమవారం బెయిలబుల్‌ వారెంటు జారీ చేసింది. భాజపా నేత కిరీట్‌ సోమయ్య భార్య మేధా సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసు

Published : 05 Jul 2022 05:55 IST

ముంబయి: శివసేన పార్లమెంట్‌ సభ్యుడు సంజయ్‌రౌత్‌పై ముంబయిలోని సేవరీ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు సోమవారం బెయిలబుల్‌ వారెంటు జారీ చేసింది. భాజపా నేత కిరీట్‌ సోమయ్య భార్య మేధా సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు రౌత్‌ హజరుకాకపోవడంతో న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఠాణె జిల్లాలోని మీరా-భయందర్‌ ప్రాంతంలో మేధా సోమయ్య తన స్వచ్ఛంద సంస్థ యువ ప్రతిష్ఠాన్‌ ద్వారా రూ.100 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణ నిధుల్లో అవినీతికి పాల్పడ్డారని రౌత్‌ ఆరోపణలు చేశారు. దీనిపై మేధ పరువు నష్టం వ్యాజ్యం దాఖలు చేశారు.


అవును! మాది ఈడీ ప్రభుత్వమే: ఫడణవీస్‌

కేంద్రంలోని భాజపా సర్కారు విపక్షాలపైకి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌)ని ఉసిగొల్పుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అసెంబ్లీలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విపక్ష ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నట్లుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈడీనేనని పేర్కొన్నారు. అయితే, ‘ఈ’ అంటే ఏక్‌నాథ్‌...‘డీ’ అంటే దేవేంద్ర అని చమత్కరించారు. బలపరీక్ష అనంతరం ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు.


ఆరు నెలల్లో మధ్యంతర ఎన్నికలు: శరద్‌ పవార్‌

హారాష్ట్రలో త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ పేర్కొన్నారు. ఆరు నెలల్లో శిందే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. శిందేకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు సంతోషంగా లేరని, మంత్రివర్గ విస్తరణ తర్వాత స్పర్థలు వస్తాయని పవార్‌ తెలిపారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. తన నేతృత్వంలోని శివసేనను అంతమొందించటానికి భాజపా కుట్ర పన్నిందని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించి ప్రజల తీర్పును కోరాలని శిందే, ఫడణవీస్‌ల నేతృత్వంలోని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. శివసేన జిల్లా అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని