కొవిడ్‌ తొలిదశలో 80.5% మంది బాధితులపై వివక్ష

దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన తొలినాళ్లలో కొవిడ్‌-19 నుంచి కోలుకున్న చాలామంది వివిధ రూపాల్లో కళంకం, వివక్ష ఎదుర్కొన్నట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. వైరస్‌ లక్షణాలు, వ్యాప్తి, చికిత్స, నివారణ

Published : 05 Jul 2022 05:55 IST

మహమ్మారిపై సమాచార లేమితోనే వారు కళంకం ఎదుర్కొన్నారు
ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన తొలినాళ్లలో కొవిడ్‌-19 నుంచి కోలుకున్న చాలామంది వివిధ రూపాల్లో కళంకం, వివక్ష ఎదుర్కొన్నట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. వైరస్‌ లక్షణాలు, వ్యాప్తి, చికిత్స, నివారణ గురించి సరైన సమాచారం లేకపోవడం వల్లే వారు వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చినట్టు విశ్లేషించింది. ఈ మేరకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ స్టాటస్టిక్స్‌ (నిమ్స్‌)తో కలిసి ఐసీఎంఆర్‌ ఏడు రాష్ట్రాలకు చెందిన మొత్తం 18 జిల్లాల్లో అధ్యయనం సాగించింది. ఆగస్టు, 2020- ఫిబ్రవరి, 2021 మధ్య 18 ఏళ్లు దాటిన కొవిడ్‌ బాధితులకు ఫోన్‌చేసి అధ్యయనకర్తలు సమాచారం సేకరించారు. కొవిడ్‌కు గురైన వ్యక్తులు, కుటుంబాలకు ఎలాంటి వివక్ష ఎదురైంది? అందుకు కారణాలేంటి? బాధితుల అనుభవాలేంటి? అన్న అంశాలపై తాము భిన్న మార్గాల్లో అధ్యయనం సాగించినట్టు నిమ్స్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డా.సరితా నాయర్‌ వివరించారు. ‘‘కరోనా పట్ల ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించడంతో అధ్యయనంలో పాల్గొన్న 60% మందికి వైరస్‌, దాని వ్యాప్తి పట్ల కొంత అవగాహన కలిగింది. అయినప్పటికీ, బాధితుల్లో 80.5% మంది ఏదోక రూపంలో వివక్షకు గురయ్యారు. 51.3% మందికి సమాజం నుంచి తీవ్రస్థాయి కళంకం ఎదురైనట్టు గుర్తించాం’’ అని ఐసీఎంఆర్‌-నిమ్స్‌ డైరెక్టర్‌ డా.ఎం.విష్ణువర్ధన్‌ రావు పేర్కొన్నారు. ఇలాంటి వారికి మానసిక స్థైర్యం అందించాల్సిన అవసరముందని సరిత సూచించారు. ఈ అధ్యయనంలో ఐసీఎంఆర్‌కు చెందిన ఆరు సంస్థలతో పాటు ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ కూడా పాలుపంచుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని