చందమామ దిశగా అమెరికా బుల్లి ఉపగ్రహం

చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములను పంపేందుకు చేస్తున్న కసరత్తులో భాగంగా అమెరికా పంపిన ఉపగ్రహం.. భూమి పరిధిని దాటి వెళ్లిపోయింది. జాబిల్లి దిశగా పయనాన్ని ఆరంభించింది.

Published : 05 Jul 2022 05:55 IST

వెల్లింగ్టన్‌: చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములను పంపేందుకు చేస్తున్న కసరత్తులో భాగంగా అమెరికా పంపిన ఉపగ్రహం.. భూమి పరిధిని దాటి వెళ్లిపోయింది. జాబిల్లి దిశగా పయనాన్ని ఆరంభించింది. కాప్‌స్టోన్‌ అనే ఈ ఉపగ్రహం మైక్రోవేవ్‌ ఒవెన్‌ పరిమాణంలో ఉంటుంది. గత నెల 28న దీన్ని న్యూజిలాండ్‌ నుంచి ఎలక్ట్రాన్‌ అనే రాకెట్‌ ద్వారా ప్రయోగించారు. చాలా పరిమిత ఇంధనంతో ప్రయాణించేలా కాప్‌స్టోన్‌ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు తీర్చిదిద్దారు. అందువల్ల చంద్రుడిని చేరుకోవడానికి దీనికి నాలుగు నెలలు పడుతుంది. 3.27 కోట్ల డాలర్లతో చాలా చౌకగా అమెరికా ఈ ప్రాజెక్టును చేపట్టింది. 25 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం చంద్రుడి చుట్టూ ఉన్న నియర్‌-రెక్టిలీనియర్‌ హాలో కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఇది సాగదీసిన అండాకార ఆకృతిలో ఉంటుంది. కక్ష్యలో ఒక కొన.. చంద్రుడికి అత్యంత చేరువగా, రెండోది చాలా దూరంగా ఉంటుంది. అక్కడ పరిభ్రమిస్తూ చందమామకు సంబంధించిన విస్తృత డేటాను ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఈ కక్ష్యలో ‘గేట్‌వే’ అనే అంతరిక్ష కేంద్రాన్ని పెట్టాలని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) తలపోస్తోంది. భవిష్యత్‌లో ‘అర్టెమిస్‌’ ప్రాజెక్టు కింద జాబిల్లి ఉపరితలంపైకి వ్యోమగాములను పంపే క్రమంలో ఈ అంతరిక్ష కేంద్రాన్ని ఓ మజిలీగా వాడుకోవాలని భావిస్తోంది. ఈ కక్ష్యలో ఉండటం వల్ల తక్కువ ఇంధనం ఖర్చవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే భూమితో నిరంతరం కమ్యూనికేషన్‌ సాగించొచ్చని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని