Published : 06 Jul 2022 06:04 IST

సీఎం పదవికి శిందే పేరును ప్రతిపాదించింది నేనే

 భాజపా నాయకత్వ ఆదేశంతోనే ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టా

దేవేంద్ర ఫడణవీస్‌ వెల్లడి

నాగ్‌పుర్‌: శివసేన చీలిక వర్గ నాయకుడు ఏక్‌నాథ్‌ శిందేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేద్దామని తమ పార్టీ అగ్ర నాయకత్వం వద్ద తానే ప్రతిపాదించానని భాజపా సీనియర్‌ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. అయితే, ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు తొలుత తాను మానసికంగా సిద్ధపడని మాట వాస్తవేమనని అంగీకరించారు. బయటి నుంచే శిందే ప్రభుత్వానికి సహకారం అందిద్దామని భావించినట్లు చెప్పారు. భాజపా అధ్యక్షుడు నడ్డా జోక్యంతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా తనతో మాట్లాడిన తర్వాతే ఆ నిర్ణయాన్ని మార్చుకున్నానని వెల్లడించారు. ప్రభుత్వంలో భాగస్వామి కాకుండా వెలుపల ఉంటూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడం భావ్యంకాదని వారు తనను ఒప్పించారన్నారు. మంగళవారం నాగ్‌పుర్‌ వచ్చిన దేవేంద్ర ఫడణవీస్‌ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, శివసేన కలిసి పోటీ చేసి విజయం సాధించాయన్నారు. అయితే, ప్రజల తీర్పు చోరీకి గురైందని పేర్కొన్నారు. ఉమ్మడి సిద్ధాంతం కోసమే శివసేన చీలిక వర్గం, భాజపా జట్టు కట్టాయని, అధికారం కోసం కాదన్నారు. ‘‘ఏక్‌నాథ్‌ శిందే పేరును ముఖ్యమంత్రి పదవికి మా పార్టీ నాయకత్వం వద్ద ప్రతిపాదించగా వారు అందుకు అంగీకరించారని అనడం సబబే. ప్రభుత్వంలో చేరకుండా బయటే ఉండాలని నేను భావించినప్పటికీ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆదేశించారు. హోంమంత్రి అమిత్‌ షా, ప్రధాని మోదీతోనూ ఇదే విషయం చెప్పించారు’’ అని ఫడణవీస్‌ వివరించారు. శివసేన సిద్ధాంతాలను దృఢంగా ముందుకు తీసుకెళ్లగలిగే వ్యక్తి ఏక్‌నాథ్‌ శిందేయేనని తెలిపారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే కుటుంబానికి మాత్రమే ఉద్ధవ్‌ ఠాక్రే వారసుడని అభిప్రాయపడ్డారు. అయితే, శివసేన ఎన్నికల చిహ్నం ఆ పార్టీలోని రెండు వర్గాల్లో ఎవరికి చెందాలన్న ప్రశ్నకు ఫడణవీస్‌ నేరుగా సమాధానమివ్వలేదు.


అన్యాయాన్ని ఎదిరించాం... తిరుగుబాటు చేయలేదు 

ఠాణె/నాగ్‌పుర్‌: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా పదవులు చేపట్టిన శిందే, ఫడణవీస్‌లకు వారి వారి స్వస్థలాల్లో ఘన స్వాగతం లభించింది. అసెంబ్లీ బలపరీక్షలో విజయం సాధించిన అనంతరం సోమవారం రాత్రి సీఎం శిందే ఠాణె వెళ్లగా...మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ నాగ్‌పుర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ మద్దతుదారులతోనూ విలేకరులతోనూ మాట్లాడారు. తాను చేసిన రాజకీయ సాహసాన్ని కొందరు విమర్శించగా మరికొందరు ప్రశంసించారని శిందే తెలిపారు. శివసేన పార్టీ కోసం తన జీవితాన్ని, కుటుంబాన్ని త్యాగం చేశానని వివరించారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ...‘మేం అన్యాయాన్ని ఎదరించామే కానీ తిరుగుబాటు చేయలేదు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే బోధనలను, రాజకీయ గురువు ఆనంద్‌ డిఘే మార్గాన్నే అనుసరించాం. వారిద్దరి దీవెనలతో పాటు ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యాను’ అని శిందే వివరించారు. ఉన్నత పదవులు చేపట్టినా శివసేన కార్యకర్తననే విషయాన్ని ఎన్నటికీ విస్మరించబోనని పేర్కొన్నారు.  ‘రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రతి నియోజకవర్గానికి ప్రాజెక్టులు కేటాయిస్తా. రాష్ట్ర రూపు రేఖలే మార్చేస్తా. ఒట్టి మాటలు చెప్పను. పనులు చేసిన తర్వాతే మాట్లాడుతా. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రసర్వతోముఖాభి వృద్ధికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. హిందుత్వ కోసం మంచి పని చేశావని మెచ్చుకున్నారు’ అని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించేలా చూస్తానని మద్దతుగా నిలిచిన 50 మంది ఎమ్మెల్యేలకు వాగ్దానం చేశానని తెలిపారు. ఒక్కసారి మాటిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పబోనని శిందే స్పష్టం చేశారు.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని