మరో నగరంపై బాంబుల వర్షం

ఉక్రెయిన్‌లోని స్లొవియాన్స్క్‌ నగరంపై రష్యా సైనిక బలగాలు పెద్దఎత్తున విరుచుకుపడ్డాయి. డాన్‌బాస్‌పై విజయం సాధించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించిన ఒకరోజు వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. నగరంపై పెద్దఎత్తున ఫిరంగుల మోత మోగిందనీ, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిందిగా పౌరులకు

Published : 06 Jul 2022 06:04 IST

స్లొవియాన్స్క్‌పై విరుచుకుపడ్డ రష్యా సైన్యం

క్రమటోర్స్క్‌: ఉక్రెయిన్‌లోని స్లొవియాన్స్క్‌ నగరంపై రష్యా సైనిక బలగాలు పెద్దఎత్తున విరుచుకుపడ్డాయి. డాన్‌బాస్‌పై విజయం సాధించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించిన ఒకరోజు వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. నగరంపై పెద్దఎత్తున ఫిరంగుల మోత మోగిందనీ, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిందిగా పౌరులకు సూచించామని స్లొవియాన్స్క్‌ మేయర్‌ వదీం లయాఖ్‌ చెప్పారు. లుహాన్స్క్‌ ప్రావిన్సులోని చివరి ప్రధాన నగరాన్ని రష్యా కైవసం చేసుకున్న తర్వాత దాడులు మరింత ముమ్మరం అయ్యాయని తెలిపారు. లుహాన్స్క్‌లోని ఓ చిన్న ప్రాంతాన్ని ఇప్పటికీ కాపాడుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో బలగాల మోహరింపును ముమ్మరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుని కార్యాలయం తెలిపింది. దొనెట్స్క్‌లోని నగరాలు, గ్రామాలపై రష్యా బలగాలు దాడులు చేశాయని ఉక్రెయిన్‌ సైనికాధికారులు చెప్పారు. పుతిన్‌ నిర్దేశించిన లక్ష్యాలన్నింటినీ చేరుకునేవరకు యుద్ధం కొనసాగుతుందని రష్యా రక్షణ మంత్రి సెర్గే షొయిగు చెప్పారు. సైనికుల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడడం ప్రస్తుతం తమ ప్రాధాన్యాంశమని తెలిపారు.

ఖేర్సన్‌లో ప్రాంతీయ ప్రభుత్వం ఏర్పాటు!

దక్షిణ ఖేర్సన్‌లో నూతనంగా ప్రాంతీయ ప్రభుత్వం ఏర్పాటైందని రష్యా అక్కడ నియమించిన అధికారులు ప్రకటించారు. రష్యా మాజీ అధికారి ఒకరు ఈ ప్రభుత్వానికి నేతగా ఉంటారు. నాలుగు నెలలకు పైగా యుద్ధం చేసిన తర్వాత లుహాన్స్క్‌ను చేజక్కించుకుని కీలక విజయం సాధించినట్లు రష్యా ప్రకటించినా, దీనికైన వ్యయం దృష్ట్యా ఇకపై వేరే ప్రాంతాల్లో మున్ముందుకు చొచ్చుకువెళ్లడంలో పరిమితంగానే వ్యవహరించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని యూనిట్లు సగం మంది సైనికుల్ని కోల్పోయిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.

* లుహాన్స్క్‌ ప్రావిన్సులోని చిట్టచివరి ప్రధాన నగరమైన లీసీచాన్స్క్‌నూ స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న రష్యన్‌ వ్యోమగాములు సంబరాలు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని