విదేశీ విమానాలకు దారులు తెరిచిన చైనా

కొవిడ్‌తో రెండేళ్లుగా అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించిన చైనా తాజాగా వాటి రాకపోకలను అనుమతించింది. అయితే భారత్‌కు సంబంధించి విమానాల రాకపోకలను పునరుద్ధరించే విషయమై ఎటూ తేల్చలేదు. భారత వృత్తినిపుణులు, వారి కుటుంబాలకు ఇప్పటికే వీసా

Updated : 06 Jul 2022 10:12 IST

భారత్‌కు రాకపోకలపై  కొనసాగుతున్న అనిశ్చితి

బీజింగ్‌: కొవిడ్‌తో రెండేళ్లుగా అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించిన చైనా తాజాగా వాటి రాకపోకలను అనుమతించింది. అయితే భారత్‌కు సంబంధించి విమానాల రాకపోకలను పునరుద్ధరించే విషయమై ఎటూ తేల్చలేదు. భారత వృత్తినిపుణులు, వారి కుటుంబాలకు ఇప్పటికే వీసా నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ విమానాలకు సంబంధించి అనిశ్చితి కొనసాగుతోంది. ఇతర దేశాల నుంచి వచ్చేవారికి చైనా క్వారంటైన్‌ గడువును కూడా క్రమబద్ధీకరించినట్లు అధికారిక మీడియా వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చేవారు నిర్దేశిత హోటళ్లలో ఉండే క్వారంటైన్‌ను 7 రోజులకు, అనంతరం ఇంటివద్ద ఉండాల్సిన సమయాన్ని 3 రోజులకు తగ్గించినట్లు తెలిపింది. ప్రపంచంతో చైనా సరిహద్దులను తెరిచేందుకు కూడా ఇదో సంకేతంగా వెల్లడించింది. ఈమేరకు క్రమబద్ధీకరించిన విధానాలను 125 దేశాల్లోని తమ దౌత్య కార్యాలయాలు ప్రకటించినట్లు తెలిపింది. దీంతో 2,025 విమానాల రాకపోకల ప్రారంభానికి రంగం సిద్ధమైనట్లు పేర్కొంది. భారత్‌-చైనాల మధ్య 2020 నవంబరు నుంచి నేరుగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే భారతీయ వృత్తి నిపుణుల కోసం రెండేళ్లుగా అమలవుతున్న వీసా నిషేధాన్ని గత నెలలో ఎత్తివేసింది. దీంతో చైనాలో పనిచేస్తూ భారత్‌లోనే ఉండిపోయినవారు రావడానికి వీలయినా.. నేరుగా విమానాలు లేకపోవడంతో వారికి సవాళ్లు ఎదురవుతున్నాయి. మూడో దేశానికి వెళ్లి.. అక్కడి నుంచి చైనా చేరుకోవడం ఖర్చుతో కూడుకున్న అంశమని వారంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చైనా కాలేజీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల పేర్లను డ్రాగన్‌ అడగడంతో భారత్‌ అందజేసింది. ఈ జాబితాలను చైనా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనా పరిమిత సంఖ్యలో శ్రీలంక, పాకిస్థాన్‌, నేపాల్‌ వంటి దేశాల నుంచి విమాన రాకపోకలను అనుమతిస్తోంది. ఇదే రీతిలో భారత్‌-చైనాల మధ్య కూడా విమానాలు నడిపే విషయమై ఉభయ దేశాలూ చర్చిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని