నాటోలో స్వీడన్‌, ఫిన్లాండ్‌ చేరికపై ముందడుగు

‘నాటో’లో స్వీడన్‌, ఫిన్లాండ్‌ చేరికకు సన్నాహాలు జరుగుతున్నాయి. కూటమిలోని 30 దేశాలు దీనికి సంబంధించిన పత్రాలపై సంతకాలు పెట్టాయి. అనంతరం.. సభ్యత్వ ప్రతిపాదనలను ఆయా దేశాల చట్టసభల ఆమోదం కోసం పంపారు.

Published : 06 Jul 2022 06:04 IST

బ్రస్సెల్స్‌: ‘నాటో’లో స్వీడన్‌, ఫిన్లాండ్‌ చేరికకు సన్నాహాలు జరుగుతున్నాయి. కూటమిలోని 30 దేశాలు దీనికి సంబంధించిన పత్రాలపై సంతకాలు పెట్టాయి. అనంతరం.. సభ్యత్వ ప్రతిపాదనలను ఆయా దేశాల చట్టసభల ఆమోదం కోసం పంపారు. ఇది ఫిన్లాండ్‌, స్వీడన్‌, నాటోకు కీలక ఘట్టమని కూటమి సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ తెలిపారు. ఈ చర్య రష్యాను మరింత ఏకాకిని చేస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు. తమ కూటమిలో చేరాల్సిందిగా స్వీడన్‌, ఫిన్లాండ్‌లకు ఇప్పటికే నాటో ఆహ్వానం పలికింది. గతవారం నాటో శిఖరాగ్ర సదస్సులో నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా నాటోకు చెందిన 30 మంది రాయబారులు, శాశ్వత ప్రతినిధులు.. ఫిన్లాండ్‌, స్వీడన్‌ చేరిక ప్రతిపాదనలపై మంగళవారం సంతకాలు చేశారు. అయితే తుర్కియే (టర్కీ) పార్లమెంటులో దీనికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కొందరు ఉగ్రవాద అనుమానితులను తమకు అప్పగించాలని ఫిన్లాండ్‌, స్వీడన్‌లను తుర్కియే ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని నెరవేర్చకుంటే నాటోలో ఈ దేశాల చేరిక ప్రతిపాదనను అడ్డుకుంటామని తేల్చి చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని