ఆకలి మంటల్లో 230 కోట్ల మంది

తగినంత ఆహారం దొరకక అల్లాడుతున్న వారి సంఖ్య మరింత పెరిగిందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర క్షుద్బాధతో, అర్ధాకలితో జీవితాలను భారంగా నెట్టుకొస్తున్న వారి సంఖ్య 230 కోట్లకు పైగానే

Published : 07 Jul 2022 06:13 IST

ప్రపంచవ్యాప్తంగా బాధితులు : ఐరాస

ఐరాస: తగినంత ఆహారం దొరకక అల్లాడుతున్న వారి సంఖ్య మరింత పెరిగిందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర క్షుద్బాధతో, అర్ధాకలితో జీవితాలను భారంగా నెట్టుకొస్తున్న వారి సంఖ్య 230 కోట్లకు పైగానే ఉందని తెలిపింది. ఇది 2021లోని పరిస్థితని, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తర్వాత సరఫరా వ్యవస్థలు విచ్ఛిన్నమై ఆహార ధాన్యాల ధరలు పెరిగి పరిస్థితి మరింతగా క్షీణించిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆకలి మంటలను చల్లార్చి, పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు ఆహార భద్రతను కల్పించే విషయంలో పురోగతి కనిపించడంలేదని పేర్కొంది. ఐరాస ఆహారం-వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆహార కార్యక్రమం, ఐరాస బాలల నిధి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించడానికి అవసరమైన పోషకాహారాన్ని పొందలేకపోవడాన్ని ఆకలి సూచీకి ప్రామాణికంగా భావిస్తూ ఈ నివేదికను రూపొందించారు. 34.5 కోట్ల మంది పస్తులతో అల్లాడుతున్నారని ప్రపంచ ఆహార కార్యక్రమ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బీస్లే తెలిపారు. 45 దేశాలకు చెందిన మరో 5 కోట్ల మంది తీవ్ర కరవు పరిస్థితులకు చేరువలో ఉన్నారని వెల్లడించారు. ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌లో ఆహార కొరత తీవ్రంగా ఉందని నివేదిక పేర్కొంది. కరవు పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం ఆహార ధాన్యాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, దీనికి రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం జత కలవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారనుందని నివేదిక హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని