Published : 07 Jul 2022 06:20 IST

హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్రలో భారీ వర్షాలు

 కులూ, శిమ్లా జిల్లాల్లో అయిదుగురి మృతి

మరో అయిదుగురి గల్లంతు

ముంబయి నగరం అతలాకుతలం

శిమ్లా, మనాలి, ముంబయి: హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్రలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్‌లోని కులూ, శిమ్లా జిల్లాలో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదల ధాటికి కులూలో ముగ్గురు, శిమ్లా జిల్లాలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో అయిదుగురు గల్లంతయ్యారని.. వీరు కూడా ప్రాణాలతో ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు. మలానా పవర్‌ ప్రాజెక్ట్‌లో పనిచేసే 25 మంది ఉద్యోగులు వరదలో చిక్కుకోగా వారిని రక్షించారు.కులూలోని మణికర్ణ్‌ వ్యాలీ చోజ్‌ గ్రామంలో పార్వతీ నది ఉప్పొంగి.. వంతెన ధ్వంసమైంది. వరదలో నలుగురు కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. శిమ్లాలో కొండచరియలు విరిగిపడి జాతీయ రహదారులపై రాకపోకలు స్తంభించాయి. విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాయి. నైరుతి రుతు పవనాల ప్రభావంతో మహారాష్ట్రలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా మూడో రోజు ముంబయిని భారీ వానలు అతలాకుతలం చేశాయి. బుధవారం కురిసిన వర్షానికి నగరంలోని పలు రహదారులు నీట మునిగాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో ఇళ్లు జలమయమయ్యాయి. రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) పేర్కొంది. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దక్షిణ కొంకణ్‌, గోవా, దక్షిణ ముంబయి ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేశారు. బుధవారం ఉదయం 8 గంటల వరకు దక్షిణ ముంబయిలో 107 మిల్లీమీటర్ల వర్షపాతం, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో వరుసగా 172, 152 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ప్రమాణస్వీకారానికి వెళ్తూ సర్పంచి..

తెహ్రీ: ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి ఒకరు మరణించగా.. ముగ్గురు గాయపడ్డారు. తెహ్రీ జిల్లా టాటోర్‌ గ్రామ సర్పంచిగా గెలిచిన ప్రతాప్‌ సింగ్‌(50) బుధవారం తట్యుడ్‌లో ప్రమాణ స్వీకారం చేసేందుకు మరో ముగ్గురితో కలిసి కారులో బయలుదేరాడు. జౌన్‌పుర్‌ మండలంలోని అల్గడ్‌-తట్యుడ్‌ రహదారిపై వెళ్తుండగా ఒక్కసారిగా పెద్ద బండరాయి వారి కారుపై పడింది. ప్రతాప్‌ సింగ్‌ అక్కడికక్కడే మరణించగా మిగిలిన ముగ్గురు గాయపడ్డారు. 


పాక్‌లో వరదలకు 25 మంది మృతి

కరాచీ: వరదల కారణంగా పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్సులో వివిధ ప్రాంతాల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అధిక శాతం మరణాలు క్వెట్టా జిల్లాలోనే చోటుచేసుకున్నాయి. క్వెట్టాలో ఇంటి గోడ కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. క్వెట్టా శివారు ప్రాంతంలోనూ ఇల్లు కూలి ఏడుగురు చనిపోయారు.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని