Published : 07 Jul 2022 06:20 IST

ప్రధాని పదవి నుంచి జాన్సన్‌ తొలగింపు సాధ్యమేనా?

లండన్‌: కొవిడ్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార నివాసంలో విందుల్లో (పార్టీ గేట్‌)పాల్గొని ఇప్పటికే పలుమార్లు దేశ ప్రజలకు, పార్లమెంటుకు క్షమాపణలు చెప్పిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గత నెలలో అవిశ్వాస పరీక్ష నుంచి త్రుటిలో బయటపడ్డారు. స్వపక్ష అధికార కన్జర్వేటివ్‌ ఎంపీలు కొందరు ఆయనకు వ్యతిరేకంగా ఓటేసినప్పటికీ పదవీ గండం నుంచి గట్టెక్కారు. ఇంతలోనే ప్రభుత్వ మాజీ డిప్యూటీ చీఫ్‌ విప్‌ క్రిస్‌ పించర్‌ వివాదంలో జాన్సన్‌ కూరుకుపోయారు. పించర్‌ నడవడిక గురించి తెలిసినా ప్రాధాన్యం గల ప్రభుత్వ పదవిలో నియమించారన్నది ప్రధాన ఆరోపణ. పార్టీ గేట్‌ వ్యవహారంలోనూ తొలుత తనకేమీ తెలియదని, ఆ తర్వాత క్షమాపణలు చెప్పినట్లుగానే క్రిస్‌ పించర్‌ వివాదంలోనూ జరిగింది. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి నిజాయతీని కేబినెట్‌లోని మంత్రులే శంకించాల్సి వచ్చింది. దీంతో రాజీనామాల పరంపర మొదలైంది. ఈ పరిస్థితుల్లో ప్రధాని పదవిలో జాన్సన్‌ కొనసాగడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ప్రతినిధుల సభలో జరిగిన ప్రశ్నావళి కార్యక్రమంలో ప్రధాని పదవిని వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. గత నెలలోనే అవిశ్వాస తీర్మానం పెట్టినందున మరో ఏడాది వరకు జాన్సన్‌ ప్రభుత్వంపై ఆ ప్రయత్నం చేసేందుకు నిబంధనలు అనుమతించవని నిపుణులు అంటున్నారు. అయితే, ఈ నిబంధనకు సవరణలు చేస్తే మళ్లీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం సాధ్యమేనని, దీనికి సంబంధించిన ‘1922 కమిటీ’ కార్యనిర్వాహకులు తలుచుకుంటే ఆ పని చేయవచ్చనే అభిప్రాయం ఉంది.

గత నెలలో మూడు పార్లమెంటరీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. జాన్సన్‌ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారనడానికి ఇదే నిదర్శనమని విపక్ష లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌ విమర్శలు సంధించారు. మునిగిపోతున్న ఓడ నుంచి ఎలుకలు పరారైనట్లుగా మంత్రులు రాజీనామాలు చేస్తున్నారని తాజా పరిణామాలపై వ్యాఖ్యానిస్తున్నారు.

Read latest Related stories News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని