రైల్వేస్టేషన్లలో వీడియో నిఘా వ్యవస్థ

రైల్వేస్టేషన్లలో వీడియో నిఘా వ్యవస్థల పనుల నిర్వహణకు ఏజెన్సీలు ఖరారయ్యాయి. దేశవ్యాప్తంగా 756 ప్రధాన స్టేషన్లలో, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 76 స్టేషన్లలో ఈ వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు భారతీయ రైల్వే,

Published : 07 Jul 2022 06:20 IST

 పనుల నిర్వహణకు ఏజెన్సీల ఖరారు

ద.మ.రై.పరిధిలో 76స్టేషన్లలో ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: రైల్వేస్టేషన్లలో వీడియో నిఘా వ్యవస్థల పనుల నిర్వహణకు ఏజెన్సీలు ఖరారయ్యాయి. దేశవ్యాప్తంగా 756 ప్రధాన స్టేషన్లలో, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 76 స్టేషన్లలో ఈ వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు భారతీయ రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థ రైల్‌టెల్‌ ఆధ్వర్యంలో నిర్భయ నిధుల కింద ఈ ప్రాజెక్టు పనులు జరగనున్నాయి. తొలివిడతగా ఈ స్టేషన్లలో వచ్చే ఏడాది జనవరి నాటికి పనులు పూర్తి చేయనున్నట్లు రైల్‌టెల్‌ ప్రకటించింది. ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉండే రైల్వేస్టేషన్లలో భద్రతను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ ఆధారిత వీడియో వ్యవస్థను చేపట్టారు. స్టేషన్లలోని విశ్రాంతి గదులు, రిజర్వేషన్‌ కౌంటర్లు, పార్కింగ్‌ స్థలాలు, ప్రధాన ప్రవేశ.. నిష్క్రమణ మార్గాలు, ప్లాట్‌ఫారం, పాదచారుల వంతెన, బుకింగ్‌ కౌంటర్‌ తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. రైల్వేస్టేషన్లలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇవీ ప్రత్యేకతలు..

* ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌తో ఉండే సీసీకెమెరాలను స్థానిక రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పోస్టులతోపాటు డివిజనల్‌, జోనల్‌స్థాయిల్లోని కంట్రోల్‌ రూంల్లో వీక్షించే సదుపాయం కల్పించనున్నారు. కృత్రిమమేధ పరిజ్ఞానంతో వీడియోను విశ్లేషించే సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఈ కెమేరాల ఫీడ్‌ను నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా పరిశీలించవచ్చు.

* పరిసరాల్ని పూర్తిస్థాయిలో వీక్షించేలా డోమ్‌, బులెట్‌, పాన్‌టిల్ట్‌ జూమ్‌, ఆల్ట్రా హెచ్‌డీ 4కె పరిజ్ఞానంతో కూడిన కెమేరాలను ఏర్పాటు చేయనున్నారు. ఆర్‌డీఎస్‌ఓ వెర్షన్‌ 6.0 ద్వారా వీడియోల్ని విశ్లేషించే సదుపాయముంటుంది. అనుమానితుల్ని కనిపెట్టేందుకు ముఖాలను గుర్తించే పరిజ్ఞానం ఉండనుంది.

* ప్రతీ ప్లాట్‌ఫాం వద్ద రెండు ప్యానిక్‌ బటన్లను ఏర్పాటు చేస్తారు. అత్యవసర సమయాల్లో ఈ వీటిని నొక్కితే స్టేషన్‌లోని ఆపరేటర్‌ కెమేరా ద్వారా ఆ వ్యక్తిని వీక్షించి సాయం అందించే అవకాశం ఉండనుంది.

* కెమెరాల ఫీడ్‌ను 30 రోజుల వరకు నిల్వ ఉంచనున్నారు. ముఖ్యమైన వీడియోల్ని 240 టీబీ స్టోరేజ్‌ వినియోగంతో నిల్వ చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని