కొత్తరకం గుట్టు తెలిసిందిలా..

నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్‌ ఒమిక్రాన్‌ను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గుర్తించడం చాలా విచిత్రంగా జరిగింది. రోజువారీ నిఘాలో భాగంగా.. ‘నెట్‌వర్క్‌ ఫర్‌ జీనోమిక్స్‌ సర్వైలెన్స్‌’లో పరిశోధనలు చేస్తున్నప్పుడు ఇది బయటపడింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి

Updated : 28 Nov 2021 06:22 IST

దక్షిణాఫ్రికాలోనే నాడు బీటా.. నేడు ఒమిక్రాన్‌!
బి.1.1.529 తీవ్రతపై సాగుతున్న పరిశోధనలు

 కేప్‌ టౌన్‌: నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్‌ ఒమిక్రాన్‌ను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గుర్తించడం చాలా విచిత్రంగా జరిగింది. రోజువారీ నిఘాలో భాగంగా.. ‘నెట్‌వర్క్‌ ఫర్‌ జీనోమిక్స్‌ సర్వైలెన్స్‌’లో పరిశోధనలు చేస్తున్నప్పుడు ఇది బయటపడింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి జరుగుతున్న మార్పులపై కన్నేసి ఉంచడం ద్వారా ఈ నిఘా వ్యవస్థ దీన్ని పసిగట్టింది. 2020 చివర్లో ఈ నెట్‌వర్క్‌ శాస్త్రవేత్తలే బీటా రకాన్ని కనుగొన్నారు. ఒమిక్రాన్‌ గురించి వీరు ఏం చెబుతున్నారంటే..

కొత్త రకాల జాడ ఎలా?
కొత్త వేరియంట్ల గుర్తింపు ప్రక్రియ సమన్వయంతో సాగాలి. వైరస్‌ సోకిన వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాలకు సంబంధించిన జన్యుక్రమాన్ని పూర్తిస్థాయిలో ఆవిష్కరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో.. సేకరించిన ప్రతి జన్యుక్రమాన్నీ తనిఖీ చేస్తారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా రకాలకు, వీటికి మధ్య వైరుధ్యాలను పరిశీలిస్తారు. తేడాల నిర్ధారణకు తదుపరి పరిశోధనలు చేపడతారు. వైరస్‌ను వృద్ధి చేసి.. టీకా లేదా మునుపటి ఇన్‌ఫెక్షన్‌ వల్ల వెలువడిన యాంటీబాడీలు కొత్త వైరస్‌ను ఎంతమేర అడ్డుకోగలవన్నది పరిశీలిస్తారు. ఈ డేటా ఆధారంగా కొత్త వైరస్‌ను వర్గీకరిస్తారు. మొదట వచ్చిన కరోనా రకంతో పోలిస్తే బీటా వేరియంట్‌.. చాలా సులువుగా ప్రజల మధ్య వ్యాప్తి చెందుతుంది. దీనివల్లే దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ రెండో ఉద్ధృతి తలెత్తింది. 2021లో డెల్టా అనే మరో రకం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. దీనివల్ల దక్షిణాఫ్రికాలో మూడో ఉద్ధృతి తలెత్తింది. తాజా వేరియంట్‌.. ఇటీవల ఈ దేశంలోని గాటెంగ్‌ ప్రావిన్స్‌లో సేకరించిన 77 నమూనాల్లో బయటపడింది.
దక్షిణాఫ్రికాలోనే కొత్త వేరియంట్లు ఎందుకు?
నిర్దిష్ట కారణాలు శాస్త్రవేత్తలకూ బోధపడటంలేదు. కొత్త వేరియంట్లను కనుగొనేందుకు ఇక్కడ చేస్తున్న గట్టి ప్రయత్నాలకు తోడు ఇతర అంశాలూ ఇందుకు దోహదపడి ఉండొచ్చు.
* రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తుల వల్ల ఇది ఉత్పన్నమై ఉండొచ్చన్న విశ్లేషణ ఉంది. అలాంటివారి శరీరం నుంచి ఒక పట్టాన వైరస్‌ తొలగిపోదు. అందువల్ల వారిలో దీర్ఘకాలం పాటు క్రియాశీల ఇన్‌ఫెక్షన్‌ కొనసాగుతుంది. వారి రోగనిరోధక శక్తి.. వైరస్‌ను నిర్మూలించలేని స్థాయిలో ఉన్నప్పటికీ అది ఆ సూక్ష్మజీవి మీద కొంత ఒత్తిడి పెడుతుంది. ఫలితంగా వైరస్‌ మార్పులకు లోనవుతుంది. దీనివల్ల కొత్త వైరస్‌ రకాలకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది.

ఆందోళనలు ఎందుకు?
ఒమిక్రాన్‌లో మునుపెన్నడూ చూడని ఉత్పరివర్తనాల మిశ్రమం ఉండటమే ఇందుకు కారణమై ఉండొచ్చు. వైరస్‌లోని కొమ్ము ప్రొటీన్‌లో ఏకంగా 30కిపైగా మార్పులు ఉన్నాయి. ఈ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుంటూ అనేక టీకాలను తయారుచేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. నిజానికి ఒమిక్రాన్‌లోని అనేక జన్యు మార్పులు ఇతర వేరియంట్లలోనూ ఉన్నాయి. అవి వ్యాధి వ్యాప్తిని ప్రభావితం చేస్తాయని, రోగ నిరోధక వ్యవస్థను ఏమారుస్తాయని శాస్త్రవేత్తలకు తెలుసు. వీటికితోడు కొత్త మార్పులు రావడమే ఆందోళనకు కారణమవుతోంది. ఈ వైరస్‌ తీరుతెన్నులను ఈ ఉత్పరివర్తనలు ఎలా ప్రభావితం చేస్తాయన్నదానిపై పరిశోధనలు సాగుతున్నాయి. దీని వ్యాప్తి, వ్యాధి తీవ్రత, టీకా పొందినవారు లేదా గతంలో కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో రోగ నిరోధక స్పందనను తప్పించుకునే సామర్థ్యం వంటివాటిని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఇతర వైరస్‌ రకాలతో దీని సామర్థ్యాన్ని పోల్చి చూస్తున్నారు. ప్రస్తుతమున్న యాంటీబాడీలతో దీన్ని నిర్వీర్యం చేయవచ్చా అన్నదానిపై దృష్టిసారించనున్నారు. సంక్లిష్టమైన ఈ ప్రక్రియ పూర్తి కావడానికి నెలలు పట్టొచ్చు.
భిన్నమైన లక్షణాలు, తీవ్ర వ్యాధి కలుగుతోందా?
ఒమిక్రాన్‌ను రకం కారణంగా బాధితుల్లో భిన్నమైన వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయనడానికి ఇప్పటివరకూ ఆధారాలు లేవు. అయితే దక్షిణాఫ్రికాలోని గాటెంగ్‌లో ఈ రకం వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అక్కడ కొవిడ్‌ జాగ్రత్తలు సరిగా లేకపోవడం, ఇప్పటికీ కేసులు తక్కువగానే ఉండటాన్ని ఇక్కడ మనం గమనంలోకి తీసుకోవాలి. అందువల్ల ఒమిక్రాన్‌ రకం.. డెల్టా కన్నా ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోందని ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కొత్త వైరస్‌కు మొదట గురయ్యేవారిలో అధిక శాతం మంది.. యువకులు, ఎక్కువగా తిరిగేవారు, ఆరోగ్యవంతులే ఉంటారు. అయితే దీర్ఘకాల వ్యాధిగ్రస్థులు, వయోధికుల్లోనే కొవిడ్‌ ఎక్కువగా తీవ్ర రూపం దాలుస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజా వేరియంట్‌ తీవ్రతపై నిర్దిష్టంగా ఒక అంచనాకు రావడానికి మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతం కొవిడ్‌ నిర్ధారణకు అనుసరిస్తున్న అన్ని పరీక్షలూ కొత్త వైరస్‌ను గుర్తించగలగడం సానుకూల పరిణామం.  
ప్రస్తుత టీకాలు రక్షిస్తాయా?
దీనిపైనా అస్పష్టత ఉంది. టీకా పొందినవారికీ ఈ రకం వైరస్‌ సోకింది. వ్యాక్సినేషన్‌ వల్ల లభించే రోగ నిరోధక స్పందన.. కొంతకాలానికి క్షీణిస్తుందని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ దశలో ఇది ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పించకపోయినా.. తీవ్రస్థాయి వ్యాధి, మరణం ముప్పు నుంచి కాపాడొచ్చని పేర్కొన్నారు. టీకా పొందినవారిలో ఎంత మందికి ఈ రకం వైరస్‌ సోకిందన్నది పరిశీలించనున్నారు. అయితే ఇప్పటికే వ్యాధి బారినపడి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉన్నందువల్ల.. కనీసం కొంతకాలంపాటైనా సహజసిద్ధ రోగనిరోధక రక్షణ ఉంటుందన్న వాదన ఊరట కలిగిస్తోంది. అంతిమంగా సార్వత్రిక టీకా కార్యక్రమాన్ని ఉద్ధృతంగా చేపట్టడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి ఆదుకుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని