యుద్ధభూమిలో నోబెల్‌ శాంతిదూత

ఆయన ఓ దేశ ప్రధాన మంత్రి. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కూడా. ఇప్పుడు స్వయంగా యుద్ధరంగంలోకి దుమికారు!

Published : 28 Nov 2021 12:00 IST

 సైనిక దుస్తుల్లో సేనలను నడిపిస్తున్న ఇథియోపియా ప్రధాని అబియ్‌ అహ్మద్‌

ఆడిస్‌ అబాబా: ఆయన ఓ దేశ ప్రధాన మంత్రి. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కూడా. ఇప్పుడు స్వయంగా యుద్ధరంగంలోకి దుమికారు! సైనిక దుస్తులు ధరించి, తిరుగుబాటు దళాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ సేనలను ముందుండి నడిపిస్తున్నారు!! దీర్ఘకాలంగా అంతర్యుద్ధంతో రగిలిపోతున్న ఇథియోపియాలో తాజా పరిస్థితి ఇది. సంబంధిత వీడియోలను ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. సైనిక దుస్తుల్లో యుద్ధభూమిలో ఉన్న ప్రధాని అబియ్‌ అహ్మద్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నాయి. పొరుగుదేశమైన ఎరిత్రియాతో ఘర్షణలను నివారించి, సంబంధాలను పునరుద్ధరించేందుకు చేసిన అసాధారణ కృషికిగాను ఇథియోపియా ప్రధాని అబియ్‌ అహ్మద్‌ 2019లో నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నారు. శాంతిని ఆకాంక్షించే ఈ నేత స్వయంగా ప్రభుత్వ సాయుధ దళాలను ముందుకు నడిపిస్తుండడం చర్చనీయాంశమయ్యింది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న టిగ్రే దళాలతో జరుగుతున్న యుద్ధంలో సైన్యానికి దిశానిర్దేశం చేస్తానని ప్రకటించిన నాలుగు రోజులకే ఇథియోపియా ప్రధాని అబియ్‌ అహ్మద్‌ రణ క్షేత్రంలోకి దిగటం విశేషం. పాలనా వ్యవహారాలను ఉప ప్రధానికి అప్పగించి టిగ్రే సరిహద్దు ప్రాంతాలైన అమ్హారా-అఫార్‌ వద్ద ఆయన సేవలందిస్తున్నారు. విజయం సాధిస్తామనే విశ్వాసంతో ఈ యుద్ధంలో పాల్గొంటున్నట్లు అబియ్‌ అహ్మద్‌ తెలిపారు. ఇప్పటికే కస్సాగితా ప్రాంతంపై నియంత్రణ సాధించామని, చిఫ్రా జిల్లా, బుర్కా పట్టణాలను స్వాధీనం చేసుకోతున్నట్లు వెల్లడించారు. అబియ్‌ గతంలో సైన్యంలో రేడియో ఆపరేటర్‌గా చేరి లెఫ్టినెంట్‌ కర్నల్‌ హోదాకు ఎదిగారు. ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇథియోపియన్‌ సేనలు-టిగ్రే తిరుగుబాటు దళాల మధ్య 2020 నవంబరులో జరిగిన సాయుధ ఘర్షణల్లో పదివేల మంది పౌరులు మరణించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని