సంక్షేమం, వ్యవసాయం కీలకం

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌కు రూపమిచ్చే కసరత్తు మొదలైంది. ప్రతిపాదనలకు ప్రభుత్వ శాఖలు తుదిరూపమిచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో శాఖల వారీగా వ్యయం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో వాటి అవసరాల మేరకు

Updated : 18 Jan 2022 04:21 IST

ప్రాధాన్య పథకాలు, కార్యక్రమాలకు నిధులు అదనం
బడ్జెట్‌ ప్రతిపాదనలకు తుదిరూపు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌కు రూపమిచ్చే కసరత్తు మొదలైంది. ప్రతిపాదనలకు ప్రభుత్వ శాఖలు తుదిరూపమిచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో శాఖల వారీగా వ్యయం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో వాటి అవసరాల మేరకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వాస్తవ వ్యయ ప్రాతిపదికనే బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించాలని ఆయా శాఖలకు ఆర్థికశాఖ స్పష్టం చేసింది. 15 రోజుల క్రితం దాని మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ శాఖలు బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి అత్యధికంగా నిధులు కేటాయించగా.. తర్వాతి స్థానంలో సంక్షేమం, నీటిపారుదలశాఖ నిలిచాయి. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు, కార్యక్రమాల నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్‌లో వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు నిధులను మరింత పెంచాల్సిన అవసరాన్ని పేర్కొంటూ సంబంధిత శాఖలు అంచనాలు రూపొందించాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దళితబంధు అమలుకు రానున్న బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు దక్కనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత బడ్జెట్‌లో దళిత సాధికారతకు రూ.1000 కోట్లను కేటాయించిన ప్రభుత్వం దళితబంధు పథకాన్ని చేపట్టింది. రాష్ట్రస్థాయిలో దాన్ని దశలవారీగా పూర్తిగా అమలుచేస్తామంది. వచ్చే బడ్జెట్‌లో పథకం అమలుకు రూ.20వేల కోట్లను కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంక్షేమ కేటాయింపుల్లో దానికి పెద్దపీట వేస్తారని సమాచారం.

వ్యవసాయానికి ఈ ఏడాది అత్యధికంగా రూ.25వేల కోట్లను కేటాయించగా వచ్చే బడ్జెట్‌లో రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా అమలు నేపథ్యంలో అంతకంటే పెంపును ప్రతిపాదిస్తూ వ్యవసాయ శాఖ అంచనాలు తయారు చేసింది.

ఆసరాకు గతం కంటే నిధులు కేటాయింపు పెరగనుంది. పింఛను అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.


సొంత రాబడులపై కొండంత ధీమా

సొంత రాబడులపై పూర్తి విశ్వాసంతో పన్నేతర ఆదాయం, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లపై పూర్తి ధీమాతో రూ.2.76 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆర్థిక సంవత్సరంలో మరో రెండున్నర నెలలే మిగిలివున్న నేపథ్యంలో సొంత పన్నుల రాబడి పూర్తి ఆశాజనకంగా ఉన్నా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, పన్నేతర ఆదాయం మాత్రం బాగా తగ్గింది. జీఎస్టీ, అమ్మకం పన్ను, ఎక్సైజ్‌ రాబడి, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ ఆదాయం, రవాణా సహా ఇతర పన్నులు, డ్యూటీల రూపేణా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15 నుంచి 20 శాతం దాకా వృద్ధిని ఆయా శాఖలు అంచనా వేస్తున్నాయి. పన్నేతర రాబడిలో భాగంగా భూముల విక్రయం ద్వారా సుమారు సుమారు రూ.20వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం అంచనా వేయగా.. ఇప్పటి వరకు సుమారు రూ.5000 కోట్లు వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండున్నర నెలలు మిగిలి ఉండటంతో పాటు హైదరాబాద్‌ చుట్టుపక్కల స్థిరాస్తి అభివృద్ధి నేపథ్యంలో భూముల వేలం ద్వారా నిధులను సమకూర్చుకోవటంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని