లండన్‌ కోర్టులో మాల్యాకు చుక్కెదురు

భారత్‌లో బ్యాంకులకు రుణాలు ఎగవేసి బ్రిటన్‌కు పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు తాజాగా లండన్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ..

Published : 19 Jan 2022 09:53 IST

లండన్‌: భారత్‌లో బ్యాంకులకు రుణాలు ఎగవేసి బ్రిటన్‌కు పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు తాజాగా లండన్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నగరంలోని విలాసవంతమైన ఆయన నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు స్విస్‌ బ్యాంక్‌ ‘యూబీఎస్‌’కు న్యాయస్థానం మార్గం సుగమం చేసింది. ‘18/19 కార్నవాల్‌ టెరాస్‌’ అనే ఈ అపార్ట్‌మెంట్‌ లక్షల పౌండ్ల విలువ చేస్తుంది. ఇందులో ప్రస్తుతం మాల్యా తల్లి లలిత నివాసం ఉంటున్నారు. మాల్యాకు చెందిన రోజ్‌ క్యాపిటల్‌ వెంచర్స్‌ సంస్థ దీన్ని తనఖా పెట్టి యూబీఎస్‌ నుంచి రుణం తీసుకుంది. దీన్ని తిరిగి చెల్లించలేదు. 2020 ఏప్రిల్‌ 30లోగా రుణాన్ని తిరిగి చెల్లించాలని 2019 మేలో కోర్టు ఆదేశించింది. అప్పటివరకూ ఆ అపార్ట్‌మెంట్‌ను మాల్యా కుటుంబ సభ్యులు తమ స్వాధీనంలోనే ఉంచుకోవచ్చని స్పష్టంచేసింది. అయితే ఆ గడువులోగా మాల్యా ఈ బాకీ తీర్చలేదు. ఈలోగా కొవిడ్‌-19 నిబంధనల వల్ల కోర్టు తీర్పు అమలుకు న్యాయపరంగా యూబీఎస్‌ చర్యలు తీసుకోలేకపోయింది. ఎట్టకేలకు గత ఏడాది అక్టోబరులో న్యాయస్థాన ఆదేశాల అమలుకు విజ్ఞప్తి చేసింది. దీంతో ఉత్తర్వులపై స్టే విధించాలంటూ మాల్యా.. కోర్టును ఆశ్రయించారు. రుణాల తిరిగి చెల్లించకుండా బ్యాంకు తనకు అనేక అవరోధాలు సృష్టించిందని ఆరోపించారు. ఆయన వాదనలను హైకోర్టులోని చాన్సరీ విభాగం న్యాయమూర్తి మాథ్యూ మార్ష్‌ తోసిపుచ్చారు. మాల్యా కుటుంబానికి మరింత గడువు ఇవ్వడానికి ఎలాంటి ప్రాతిపదిక కనిపించడంలేదని పేర్కొన్నారు. వారి పిటిషన్‌ను కొట్టేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు