Modi: డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో మోదీ ప్రసంగానికి బ్రేకులు!

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ఆన్‌లైన్‌ సదస్సులో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రసంగానికి ఓ దశలో బ్రేకులు పడ్డ ఘటన

Published : 19 Jan 2022 10:38 IST

టెలీప్రాంప్టర్‌ పనిచేయలేదంటూ కాంగ్రెస్‌ ఎద్దేవా

దిల్లీ: ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ఆన్‌లైన్‌ సదస్సులో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రసంగానికి ఓ దశలో బ్రేకులు పడ్డ ఘటన భాజపా, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ప్రధానికి ప్రసంగాన్ని అందించే టెలీప్రాంప్టర్‌లో సమస్య తలెత్తడం వల్లే అంతరాయం ఏర్పడిందని హస్తం పార్టీ ఆరోపించింది. టెలీప్రాంప్టర్‌ పనిచేయనప్పుడు మోదీ మాట్లాడలేకపోయారని ఎద్దేవా చేసింది. ఆ ఆరోపణలను భాజపా నాయకులు తోసిపుచ్చారు. డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు నిర్వాహకుల వైపు సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రధాని తన ప్రసంగాన్ని పునఃప్రారంభించాల్సి వచ్చిందని వివరించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంగానీ, డబ్ల్యూఈఎఫ్‌గానీ ఈ వ్యవహారంపై అధికారికంగా స్పందించలేదు.  ప్రధాని మోదీ చెప్పే అబద్ధాల స్థాయిని టెలీప్రాంప్టర్‌ కూడా తట్టుకోలేకపోయిందని.. అందుకే పనిచేయడం మానేసిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా మంగళవారం చురకలంటించారు. ‘‘టెలీప్రాంప్టర్‌తో మీరు ప్రసంగించొచ్చు. కానీ దాన్ని ఉపయోగించి పరిపాలన కొనసాగించలేరు. యావద్దేశానికి ఈ విషయం సోమవారం అవగతమైంది’’ అని కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా పేర్కొన్నారు. టెలీప్రాంప్టర్‌ పనిచేయనప్పుడు డబ్ల్యూఈఎఫ్‌ వేదికపై దేశానికి మోదీ ప్రాతినిధ్యం వహించలేకపోయారని విమర్శిస్తూ యువజన కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. మరోవైపు- భాజపా నేతలు మాత్రం.. ప్రధాని ప్రసంగం ఆంగ్ల అనువాదం లేకుండా అసంబద్ధంగా ప్రారంభమైందని.. అందుకే ఆయన మళ్లీ ప్రసంగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని