TS News: ప్రమాదాలకు ‘తెర’ తీస్తున్నారు

వినోదం కోసం సినిమా థియేటర్‌కెళ్తున్నారా..? కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. పొరపాటున అగ్నిప్రమాదం జరిగితే చిక్కులు తప్పవు.

Published : 19 Jan 2022 10:35 IST

సినిమా థియేటర్లలో లోపాలున్నట్లు గుర్తింపు
అగ్నిమాపక శాఖ ప్రాథమిక పరిశీలనలో వెల్లడి

హైదరాబాద్‌: వినోదం కోసం సినిమా థియేటర్‌కెళ్తున్నారా..? కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. పొరపాటున అగ్నిప్రమాదం జరిగితే చిక్కులు తప్పవు. మంటల్లో నుంచి బయటపడేందుకు అష్టకష్టాలు పడాల్సిందే. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని శివపార్వతి టాకీస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు రెండో ఆట ముగిసిన తర్వాత షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈనేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక శాఖ చేపట్టిన ప్రాథమిక పరిశీలనలో పలు విస్మయకర విషయాలు వెల్లడయ్యాయి. రెండో మెట్లమార్గం లేని థియేటర్లు ఇంకా మనుగడలో ఉన్నట్లు తేలింది. పాతకాలపు నిబంధనల మేరకు కట్టినవి ఇంకా అలాగే కొనసాగుతున్నట్లు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా 339 సినిమా థియేటర్లుండగా.. మూడోంతులకు పైగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉన్నాయి. నిత్యం జనంతో కిక్కిరిసి ఉండే సినిమాహాళ్లలోని బాల్కనీలకు తప్పనిసరిగా రెండో మెట్లమార్గం ఉండాలని అగ్నిమాపక శాఖ నిబంధనలు చెబుతున్నా ఇప్పటికీ పలు థియేటర్లలో ఆ సదుపాయం లేదని తాజాగా బహిర్గతం కావడం విస్తుగొలుపుతోంది. కనీసం ఇనుప కడ్డీలతో కూడిన మెట్లయినా తప్పనిసరి. కానీ అలాంటి సదుపాయమూ లేని థియేటర్లున్నట్లు గుర్తించారు. ఈనేపథ్యంలో బుధవారం నుంచి జిల్లాలవారీగా సమగ్ర పరిశీలనకు బృందాలు ఏర్పాటయ్యాయి.

పేరుకే అగ్నిమాపక పరికరాలు
రాష్ట్రంలోని పలు థియేటర్లలో పేరుకే అగ్నిమాపక పరికరాలున్నా చాలావరకు పనిచేయడం లేదని తేలింది. హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌లలో సదుపాయాలు బాగానే ఉన్నట్లు తేలినా.. మిగిలిన థియేటర్లలో మాత్రం లోపాల్ని గుర్తించారు.

పలు థియేటర్లలో చాలా రోజుల కింద ఏర్పాటు చేసిన పరికరాలు నిర్వహణ సరిగా లేని కారణంగా చెడిపోయినట్లు గుర్తించారు. ఆకస్మికంగా అగ్నిప్రమాదం జరిగితే మంటలనార్పేందుకు అవి పనిచేయవని వెల్లడైంది.
దాదాపు 50 థియేటర్లలో అగ్నిమాపక వ్యవస్థనే సరిగా లేదని తేటతెల్లమైంది.
17 టాకీసుల్లో ఏమాత్రం నిబంధనలను పాటించడం లేదని వెల్లడైంది.
60 వరకు సినిమాహాళ్లలో సదుపాయాలు కొంతమేర బాగున్నట్లు తేలింది.

స్పందించకుంటే ప్రాసిక్యూట్‌ చేస్తాం: పాపయ్య, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి
రాష్ట్రంలోని పలు థియేటర్లలో అగ్నిమాపక వ్యవస్థలు సక్రమంగా లేనట్లు ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. ఈనెల 24 లోపు అగ్నిమాపక బృందాల ఆధ్వర్యంలో సమగ్ర పరిశీలన జరగనుంది. తనిఖీల అనంతరం గుర్తించిన లోపాల సవరణకు నెలరోజుల గడువిస్తాం. ఆలోపు పరిష్కరించుకోకపోతే షోకాజ్‌ నోటీస్‌ జారీ చేస్తాం. అయినా స్పందించకపోతే కేసుపెట్టి ప్రాసిక్యూట్‌ చేస్తాం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని