ఓబీసీ జాబితాలో ట్రాన్స్‌జెండర్లను చేర్చొద్దు: ప్రభుత్వానికి ఎన్‌సీబీసీ సూచన

కేంద్ర ఓబీసీ జాబితాలో ట్రాన్స్‌జండర్లను ప్రత్యేకంగా పేర్కొనాలన్న మోదీ ప్రభుత్వ ప్రతిపాదనను... జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌

Published : 19 Jan 2022 09:55 IST

దిల్లీ: కేంద్ర ఓబీసీ జాబితాలో ట్రాన్స్‌జండర్లను ప్రత్యేకంగా పేర్కొనాలన్న మోదీ ప్రభుత్వ ప్రతిపాదనను... జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ (ఎన్‌సీబీసీ) వ్యతిరేకించింది. అలా చేయడం వల్ల ఈ జాబితాలో ఇప్పటికే ఉన్న కులాలవారి రిజర్వేషన్‌ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖకు ఎన్‌సీబీసీ తన ప్రాథమిక స్పందనను తెలియజేసింది. కమిషన్‌లో ఒక్కరు మినహా మిగతా సభ్యులంతా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.‘‘ట్రాన్స్‌-జెండర్లను కేంద్ర ఓబీసీ జాబితాలో ఒక ప్రత్యేక బ్లాక్‌గా పేర్కొనరాదు. అలా చేయడం వల్ల ఇతర కులాలవారి రిజర్వేషన్‌ ప్రయోజనాలు దెబ్బతింటాయి. అందుకు బదులుగా- వారిని తమ సొంత సామాజిక వర్గాల్లోనే ప్రత్యేకంగా గుర్తించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుటుంబాల్లో జన్మించిన ట్రాన్స్‌-జెండర్లను ఆయా విభాగాల్లోనే ప్రత్యేకంగా పేర్కొనాలి’’ అని మెజార్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు. అయితే, సభ్యురాలు డా.సుధా యాదవ్‌ మాత్రం ఈ విషయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కొద్ది లక్షల సంఖ్యలోనే ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని, ఓబీసీ జాబితాలో చేర్చడం వల్ల ఇతరులకు పెద్ద నష్టమేమీ ఉండదని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఎన్‌సీబీసీ తన తుది నివేదికను ఇంకా ప్రభుత్వానికి సమర్పించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని