8 నెలల్లో.. పన్నుల రాబడి 60 శాతం

రాష్ట్రానికి పన్నుల రూపంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబరు నాటికి 60 శాతం ఆదాయం లభించింది. ఇది గత ఏడాది కన్నా 16 శాతం అధికం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి పన్నుల రాబడి లక్ష్యం రూ.1,06,900 కోట్లు కాగా నవంబరు వరకు రూ.64,857 కోట్లు వచ్చింది.

Updated : 20 Jan 2022 05:24 IST

అంచనాల మేరకు అమ్మకం పన్ను
అదే బాటలో జీఎస్టీ, ఎక్సైజ్‌ ఆదాయం
గణనీయంగా తగ్గిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, పన్నేతర రాబడి
కాగ్‌కు రాష్ట్ర ఆర్థికశాఖ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రానికి పన్నుల రూపంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబరు నాటికి 60 శాతం ఆదాయం లభించింది. ఇది గత ఏడాది కన్నా 16 శాతం అధికం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి పన్నుల రాబడి లక్ష్యం రూ.1,06,900 కోట్లు కాగా నవంబరు వరకు రూ.64,857 కోట్లు వచ్చింది. నవంబరు నాటికి రాష్ట్ర రాబడులు, వ్యయాలపై రాష్ట్ర ఆర్థికశాఖ కాగ్‌కు పూర్తి వివరాలు అందించింది. ఈ గణాంకాల్లో ప్రధానంగా ఎక్సైజ్‌ రాబడి, అమ్మకం పన్ను, జీఎస్టీ రాబడులు 60 శాతానికి పైగా ఉన్నాయి. పన్నేతర రాబడిని రూ.30,557 కోట్లుగా అంచనా వేయగా.. రూ.4,395 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ రాబడిలో ప్రధానంగా భూముల విక్రయాల ద్వారా రూ.20వేల కోట్లకు పైగా సమీకరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినా, ఇదింత వరకు రూ.4వేల కోట్లకే పరిమితమైంది.

గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో ప్రభుత్వం భారీగా అంచనా వేసింది. అయితే నవంబరు వరకు కేవలం 15శాతం లోపే  ఆదాయం వచ్చింది. ఈ కేటగిరీ కింద ఈ ఏడాదికి రూ.38,669 కోట్లు అంచనా వేయగా, మొదటి 8 నెలల్లో రూ.5,687కోట్లు మాత్రం వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన ప్రత్యేక నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అందకపోవడంతో ఈ రాబడి తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యయం రూ.1,69,383 కోట్లు అంచనా వేయగా.. నవంబరు వరకు రూ.81,883 కోట్ల ఖర్చయింది. ప్రధానంగా రెవెన్యూ ఖాతాలో రూ.34,763 కోట్లు వ్యయం కాగా, మిగిలినవి వడ్డీల చెల్లింపు, వేతనాలు, పింఛన్లు, సబ్సిడీలకు ఖర్చుచేసింది. రాష్ట్ర రాబడులు ప్రధానంగా జీఎస్టీ, అమ్మకంపన్ను, రిజిస్ట్రేషన్‌ రాబడులు, ఎక్సైజ్‌ ఆదాయం క్రమంగా పెరుగుతుండటంతో పన్నుల రాబడుల అంచనాలపై ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో ఉంది. ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలల్లో రాబడులు గణనీయంగా పెరుగుతాయని ఆర్థిక శాఖ అంచనాలు వేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని