రెంటికీ చెడ్డ హరక్‌సింగ్‌ రావత్‌!

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నుంచి ఉద్వాసనకు గురైన హరక్‌సింగ్‌ రావత్‌ను గత పాపం వెంటాడుతోంది.

Published : 20 Jan 2022 11:06 IST

ఈనాడు, దిల్లీ: ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నుంచి ఉద్వాసనకు గురైన హరక్‌సింగ్‌ రావత్‌ను గత పాపం వెంటాడుతోంది. ఆయన ఇదివరకు హరీశ్‌ రావత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చిన కారణంగా.. ఇప్పుడు భాజపా బయటకు గెంటేసినా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ఆదరించలేని పరిస్థితి ఉంది. సాధారణంగా రాజకీయాల్లో ప్రజాదరణ ఉన్న నాయకులను ఏ పార్టీ అయినా ఆగమేఘాల మీద అక్కున చేర్చుకోవడం రివాజు. హరక్‌సింగ్‌కు ఆ సూత్రం వర్తించడంలేదు. పుష్కర్‌ధామీ ప్రభుత్వం ఉద్వాసన పలికి మూడు రోజులైన తర్వాత కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన ఆ పార్టీ తలుపులు తడుతూనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

చూసిచూసి వేటు 

2016లో అప్పటి హరీశ్‌రావత్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హరక్‌సింగ్‌ రావత్‌ కాంగ్రెస్‌పార్టీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలను చీల్చి ఆ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకపాత్ర పోషించారు. 2017లో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మంత్రి అయ్యారు. అప్పటినుంచి భాజపా నాయకత్వంతో నిరంతరం గొడవపడుతున్నా కమలనాథులు సర్దుకుపోతూ వచ్చారు. తనకు, కోడలికి టికెట్ల కోసం గత ఆదివారం దిల్లీకి చేరుకొని భాజపా నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు. దీంతో ముఖ్యమంత్రి పుష్కర్‌ ధామీ, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు మదన్‌ కౌశిక్‌లు మాట్లాడుకొని ఆయన్ని ప్రభుత్వం నుంచి సాగనంపారు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరడానికి హరక్‌సింగ్‌ ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి హరీశ్‌ రావత్‌ మోకాలడ్డారు. 

పోటీ చేయను: త్రివేంద్రసింగ్‌ రావత్‌ 

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బుధవారం ఈ మేరకు లేఖ రాశారు. ‘‘దేవభూమి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసే భాగ్యాన్ని పార్టీ కల్పించడం నా అదృష్టం. అందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను. రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి జరిగింది. పుష్కర్‌ ధామీ నేతృత్వంలో భాజపాకు యువ నాయకత్వం లభించింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. గత మార్చిలో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన ఆయన ఇప్పుడు లేఖ రాయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ దిల్లీలో సమావేశమై అభ్యర్థులను ఖరారు చేయబోతున్న తరుణంలో ఆయన లేఖ రాయడం విశేషం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని