గ్యాస్‌ లీకేజీ వల్లే యుద్ధనౌకలో పేలుడు!

ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ యుద్ధనౌకలో ముగ్గురు సిబ్బంది మరణానికి కారణమైన పేలుడుపై భారత నౌకాదళం దృష్టి సారించింది. 

Published : 20 Jan 2022 11:16 IST

ఏసీ కంపార్ట్‌మెంట్‌లో విడుదలైన వాయువు
మృతులను గుర్తించిన నౌకాదళం 

ముంబయి: ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ యుద్ధనౌకలో ముగ్గురు సిబ్బంది మరణానికి కారణమైన పేలుడుపై భారత నౌకాదళం దృష్టి సారించింది. నౌకలోని ఎయిర్‌ కండిషనింగ్‌ కంపార్ట్‌మెంట్‌లో ఈ విస్ఫోటం చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఫ్రియాన్‌ గ్యాస్‌ లీకేజీయే దీనికి కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌ (ఎంసీపీవో) ఫస్ట్‌ క్లాస్‌ క్రిషన్‌ కుమార్, ఎంసీపీవో సెకండ్‌ క్లాస్‌ సురీందర్‌ కుమార్, ఎంసీపీవో సెకండ్‌ క్లాస్‌ ఏకే సింగ్‌గా గుర్తించారు. వీరి మృతికి నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరి కుమార్‌ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు బాసటగా ఉంటామని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై ముంబయి పోలీసులు ‘ప్రమాదవశాత్తు జరిగిన మరణాల’ కేసు నమోదు చేశారు. మృతదేహాలకు స్థానిక జె.జె.ఆసుపత్రిలో పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించారు. 

రణ్‌వీర్‌.. ముంబయిలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో లంగరేసి ఉన్నప్పుడు మంగళవారం ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం కేంద్రంగా సేవలు అందించే ఈ యుద్ధనౌక గత ఏడాది నవంబరు నుంచి తాత్కాలికంగా ముంబయిలో విధులు నిర్వర్తిస్తోంది. 

మందుగుండు సామగ్రి పేలలేదు

నౌక ప్రమాదానికి మందుగుండు సామగ్రి విస్ఫోటం కారణం కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. విస్ఫోటం జరిగినప్పుడు ఆ కంపార్ట్‌మెంట్‌లో సిబ్బంది లేరని పేర్కొన్నాయి. పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న మెస్‌ కంపార్ట్‌మెంట్‌ ధ్వంసమైందని వివరించాయి. బాధితులు అందులోనే ఉన్నారని, వారు శకలాల కింద చిక్కుకుపోయారని వెల్లడించాయి. 11 మంది క్షతగాత్రుల్లో ఎక్కువ మందికి ఎముకలు విరిగాయి. ఫ్రియాన్‌ గ్యాస్‌ పీల్చడం వల్ల కొందరు అస్వస్థులయ్యారు. 5వేల టన్నుల బరువుండే ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌లో 30 మంది అధికారులు 310 మంది నావికులు పనిచేస్తున్నారు. ఇది గరిష్ఠంగా 30 నాట్‌ల వేగాన్ని అందుకోగలదు. గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ తరగతికి చెందిన ఈ యుద్ధనౌక.. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి, ఉపరితలం నుంచి గగనతలంలోకి క్షిపణులను ప్రయోగించగలదు. ఇందులో విమాన విధ్వంసక తుపాకులు, టోర్పిడోలూ ఉన్నాయి. ప్రస్తుత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ హరికుమార్‌ కూడా గతంలో ఈ యుద్ధనౌకకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

ఏమిటీ ఫ్రియాన్‌?

ఫ్రియాన్‌ అనేది క్లోరోఫ్లోరోకార్బన్‌ (సీఎఫ్‌సీ) తరగతికి చెందిన వాయువు. దీన్ని ఫ్రిజ్‌లు, ఏసీల్లో శీతలీకరణ సాధనంగా ఉపయోగిస్తున్నారు. స్ప్రేలు, పెయింట్‌ థిన్నర్‌లలోనూ వాడుతున్నారు. ఈ వాయువుకు రంగు, వాసన ఉండదు. దీనివల్ల వాతావరణంలోని ఓజోన్‌ పొరకు హాని జరుగుతుందని గుర్తించారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఫ్రియాన్‌ వినియోగాన్ని తగ్గించేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని