ఒంటరిగా లోకమంతా రయ్‌రయ్‌

ఓ మగువ తెగువకు ప్రపంచయానం పాదాక్రాంతమైంది! అతిపిన్న వయసులో విమానంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టొచ్చిన అద్భుత ఘనత ఆమె సొంతమైంది. బెల్జియన్‌-బ్రిటిష్‌ పైలట్‌ జారా రూథర్‌ఫర్డ్‌ వయసు 19 ఏళ్లు.

Updated : 21 Jan 2022 11:16 IST

విమానంలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన 19 ఏళ్ల యువతి

అతిపిన్న వయసులో ఈ ఘనత సాధించిన మహిళగా రికార్డు

బ్రస్సెల్స్‌: ఓ మగువ తెగువకు ప్రపంచయానం పాదాక్రాంతమైంది! అతిపిన్న వయసులో విమానంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టొచ్చిన అద్భుత ఘనత ఆమె సొంతమైంది. బెల్జియన్‌-బ్రిటిష్‌ పైలట్‌ జారా రూథర్‌ఫర్డ్‌ వయసు 19 ఏళ్లు. బెల్జియంలోని కోర్ట్‌రైలో ఓ చిన్న విమాన స్థావరం నుంచి 155 రోజుల క్రితం తన సాహసయాత్రకు శ్రీకారం చుట్టిన ఆమె.. ఏకంగా 52 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మళ్లీ సురక్షితంగా గురువారం కోర్ట్‌రైకి చేరుకున్నారు. అతిచిన్న వయసులో ఒంటరిగా విమానంలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన మహిళగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఆమె పేరు గిన్నిస్‌ పుస్తకంలోకి ఎక్కనుంది. ఇప్పటివరకు ఈ రికార్డు అమెరికాకు చెందిన శేష్టా వైజ్‌ (30 ఏళ్ల వయసులో) ఉంది.

జారా తల్లిదండ్రులిద్దరూ పైలట్లే. బాల్యం నుంచే ఆమకూ విమానయానంపై అమితాసక్తి. 14 ఏళ్ల వయసులోనే చిన్న విమానాలను ఒంటరిగా నడపడం ప్రారంభించింది. 3 నెలల్లో ప్రపంచాన్ని చుట్టిరావాలన్న లక్ష్యంగా తేలికపాటి షార్క్‌ మోడల్‌ విమానంలో తాజా సాహసయాత్రకు ఆమె శ్రీకారం చుట్టినా.. ప్రతికూల వాతావరణం, వీసా సమస్యల వంటి కారణాల వల్ల 155 రోజుల పాటు యాత్ర కొనసాగింది. ఇందులో భాగంగా ఐదు ఖండాల్లో 41 దేశాలను ఆమె సందర్శించింది. కాలిఫోర్నియాలో కార్చిచ్చులు, రష్యాలో ఎముకలు కొరికే చలి వంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ముందుకుసాగింది. ఓ దశలో ఉత్తర కొరియా గగనతలంలోకి ప్రవేశించకుండా కొద్దిలో తప్పించుకొని బయటపడింది. మహిళలు విమానయాన రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించడానికి ఈ సాహస యాత్రను చేపట్టినట్లు జారా తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని