బహిరంగ ర్యాలీలపై 31 వరకు నిషేధం

ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో కరోనా విస్తరణ పరిస్థితులపై శనివారం సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఈ నెల 31 వరకు నిషేధాన్ని పొడిగించింది. ఇదివరకు

Updated : 23 Jan 2022 05:52 IST

ఇంటింటి ప్రచారం చేసే వారి సంఖ్య 5 నుంచి 10కి పెంపు

అభ్యర్థులు ఖరారైన తర్వాత 500 మందితో సమావేశాలు నిర్వహించుకోవచ్చు

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం

ఈనాడు, దిల్లీ: ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో కరోనా విస్తరణ పరిస్థితులపై శనివారం సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఈ నెల 31 వరకు నిషేధాన్ని పొడిగించింది. ఇదివరకు విధించిన నిషేధ గడువు శనివారంతో పూర్తి కావడంతో అయిదు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య ఎన్నికల అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన తర్వాత ఎన్నికల సంఘం కమిషనర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ పురోగతిని కూడా ఎన్నికల సంఘం అడిగి తెలుసుకొంది. అర్హులైన వారితో పాటు, ఎన్నికల సిబ్బందికి సాధ్యమైనంత మేరకు 1, 2 డోసుల వ్యాక్సిన్‌ పూర్తి చేయాలని సూచించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో మొత్తం 8 నిర్ణయాలు తీసుకొంది.

1.జనవరి 31 వరకు అన్ని రకాల రోడ్డు షోలు, పాదయాత్రలు, సైకిల్‌, బైక్‌ ర్యాలీలు, ఉరేగింపులపై నిషేధం.

2. తొలి దశ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు జనవరి 27 నాటికి పూర్తవుతుంది కాబట్టి రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు గరిష్ఠంగా 500 మందితో కానీ, లేదంటే స్థానిక అధికారులు ప్రకటించిన మైదాన సామర్థ్యంలో 50% మందితో కానీ ఇందులో ఏది తక్కువైతే అంత మేర జనంతో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 8 వరకు బహిరంగ సమావేశాలు నిర్వహించుకోవచ్చు.

3. 2వ దశలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు జనవరి 31 నాటికి ఖరారవుతాయి కాబట్టి ఇవే నిబంధనలను అనుసరించి వారు ఫిబ్రవరి 1 నుంచి 12 వరకు భౌతిక బహిరంగ సభలు ఏర్పాటు చేసుకోవచ్చు.

4. ఇంటింటికి ప్రచారం చేసే వారిపై ఇప్పటివరకు విధించిన గరిష్ఠ పరిమితి 5ని 10కి పెంచారు. భద్రత సిబ్బంది కాకుండా పది మందితో ఇంటింటి ప్రచారం నిర్వహించుకోవచ్చు. మిగిలిన నిబంధనలన్నీ యథాతథంగా కొనసాగుతాయి. అలాగే గరిష్ఠంగా 300 మందితో కానీ, లేదంటే హాల్‌ సామర్థ్యంలో 50% మందిలో ఏది తక్కువైతే అంత మందితో ఇండోర్‌ మీటింగ్‌లు పెట్టుకోవచ్చు.

5. బహిరంగ స్థలాల్లో వీడియోలు, పబ్లిసిటీ వాహనాలను గరిష్ఠంగా 500 మంది కానీ, అక్కడున్న స్థలంలో 50% మంది కానీ కొవిడ్‌ నిబంధనలకు లోబడి చూడొచ్చు.

6. రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలి.

7. ఏయే ప్రాంతాల్లో వీడియో ప్రదర్శనలు, పరిమిత సంఖ్యతో బహిరంగ, ఇండోర్‌ మీటింగ్‌లు నిర్వహించే స్థలాలను జిల్లా అధికారులు ముందుగానే ఎంపిక చేసి ప్రకటన చేయాలి.

8. మిగిలిన నిబంధనలన్నీ జనవరి 8న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కొనసాగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని