
Russia: వేడి పెంచిన రష్యా!..మరిన్ని యుద్ధవిన్యాసాలకు నిర్ణయం
ఉక్రెయిన్‌పై అగ్రరాజ్యాల మధ్య ప్రతిష్టంభన
మాస్కో: ఉక్రెయిన్ అంశంపై అమెరికా, రష్యాల మధ్య పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక ఈ రెండు దేశాల మధ్య భద్రతపరంగా చెలరేగిన అతిపెద్ద సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో దాదాపు లక్ష మంది సైనికులను మోహరించిన రష్యా తదుపరి వ్యూహం పశ్చిమ దేశాలకు అంతుచిక్కడంలేదు. మరోవైపు ఈ ప్రాంతంలో మరిన్ని సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నామని ప్రకటించిన రష్యా.. వేడిని రాజేసింది. కరీబియన్ ప్రాంతంలో సైనిక మోహరింపులనూ కొట్టిపారేయలేమని పేర్కొంది. అమెరికా, దాని మిత్రపక్షాలను వ్యతిరేకించే నేతలతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చలు జరుపుతున్నారు.
ఉక్రెయిన్‌ను ఆక్రమించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఆ చర్యకు పూనుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. ఉక్రెయిన్‌ను నాటో కూటమిలోకి చేర్చుకోవడాన్ని పుతిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మధ్య, తూర్పు ఐరోపా నుంచి ఈ కూటమి దళాలు వైదొలగాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. ఈ డిమాండ్లను నెరవేర్చకుంటే ‘కొన్ని సైనిక-సాంకేతిక చర్యల’కు తాను ఆదేశించాల్సి వస్తుందని తాజాగా హెచ్చరించారు. ఉక్రెయిన్ సైన్యంతో నాటో విన్యాసాలు నిర్వహించడం, కూటమి యుద్ధనౌకలు తరచూ నల్ల సముద్రాన్ని సందర్శించడం, అమెరికా బాంబర్ విమానాలు క్రిమియా వద్దకు రావడాన్ని ఆయన ఖండించారు. ఉక్రెయిన్‌లో సైనికపరంగా పాగా వేసేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేశారు.
తూర్పు ఉక్రెయిన్‌లో విద్రోహ చర్యలతో అతలాకుతలం చేసి, ఆ నేరాన్ని అక్కడి ప్రభుత్వంపై మోపేందుకు రష్యా కుట్ర పన్నుతున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. తద్వారా తన దురాక్రమణకు ప్రాతిపదికను సిద్ధం చేస్తోందని చెబుతోంది. ఈ ఆరోపణలను రష్యా కొట్టిపారేసింది. రష్యా, ఉక్రెయిన్ ప్రజలు ఒకటేనని పుతిన్ పదేపదే చెబుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉన్న అనేక భూభాగాలు ఒకప్పుడు రష్యాలో భాగంగా ఉండేవని పేర్కొన్నారు. సోవియట్ హయాంలో వాటిని ఉదారంగా ఉక్రెయిన్‌కు ధారాదత్తం చేశారని ఆరోపిస్తున్నారు.
మరోవైపు అమెరికా ఉత్పత్తి చేసిన ట్యాంకు, విమాన విధ్వంసక క్షిపణులను ఉక్రెయిన్‌కు సరఫరా చేయాలని ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియాలు నిర్ణయించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ దీన్ని స్వాగతించారు. సోవియట్ యూనియన్‌లో ఒకప్పుడు భాగంగా ఉన్న ఆ మూడు దేశాలు ఉక్రెయిన్‌కు బాసటగా నిలవడాన్ని ప్రశంసించారు. అయితే ఆయుధ సరఫరాను ప్రమాదకరమైన చర్యగా రష్యా ఇప్పటికే అభివర్ణించింది. వీటివల్ల ఉద్రిక్తతలు తగ్గబోవని స్పష్టంచేసింది.