
Omicron: సామాజిక వ్యాప్తి స్థాయికి ఒమిక్రాన్
ఇన్సాకాగ్ వెల్లడి
దిల్లీ: సార్స్ కోవ్-2 వైరస్ వేరియంట్ అయిన ఒమిక్రాన్ మన దేశంలో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని జన్యుక్రమాన్ని విశ్లేషించే సంస్థల కన్సార్షియం(ఇన్సాకాగ్) తెలిపింది. దిల్లీ, ముంబయి నగరాల్లో ఈ వేరియంట్ ప్రబలంగా ఉందని పేర్కొంది. విదేశీ ప్రయాణికుల నుంచి వ్యాపించే దానికన్నా దేశీయంగా అంతర్గత వ్యాప్తే అధికంగా ఉన్నట్లు అంచనా వేసింది. ‘‘వ్యాక్సిన్ పొందిన ప్రయాణికుల్లో తొలుత ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించడం జరిగింది. ఈ వేరియంట్ సోకినా ప్రస్తుతం చాలా మందిలో వైరస్ లక్షణాలు బహిర్గతం కావడంలేదు(అసింప్టమాటిక్). మరి కొందరిలో స్వల్ప స్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయి. అయితే, టీకా తీసుకోని హైరిస్కు ఉన్న వ్యక్తుల్లోనూ ఇటువంటి తక్కువ ప్రభావాన్ని చూపుతుందని భావించడం సరికాదు’’అని ఇన్సాకాగ్ హెచ్చరించింది. వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం తక్కువేనని, ప్రాణాపాయ ముప్పు కూడా స్వల్పమేనని పేర్కొంది. అంతమాత్రాన ఒమిక్రాన్‌ను నిర్లక్ష్యం చేయడం తగదని, తగు రక్షణ విధానాలను పాటించాల్సిందేనని స్పష్టంచేసింది.