Alzheimers:గుండె జబ్బుతో మెదడులోనూ సమస్యలు

గుండె జబ్బు వల్ల నడి వయసులోనే మెదడులోనూ సమస్యలు మొదలవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది.

Published : 24 Jan 2022 11:07 IST

పెరగనున్న అల్జీమర్స్‌ ముప్పు

లండన్‌: గుండె జబ్బు వల్ల నడి వయసులోనే మెదడులోనూ సమస్యలు మొదలవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. ఇది తీవ్ర మతిమరుపునకు దారితీయవచ్చని తేల్చింది. అల్జీమర్స్‌ వ్యాధికి కారణమయ్యే బీటా అమిలాయిడ్‌ అనే ప్రొటీన్‌ను ఇది మూడింతలు చేస్తుందని కూడా వివరించింది. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ షెఫీల్డ్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. మెదడులోని చర్యలకు, రక్త ప్రవాహానికి మధ్య సంధానకర్తగా ఉండే ఒక కీలక విధిని గుండె జబ్బు దెబ్బతీస్తుందని వారు చెప్పారు. దీనివల్ల సరిపడినంత రక్త ప్రవాహం మెదడుకు అందదని వివరించారు. అలాగే అవసరమైనంతగా ఆక్సిజన్‌ కూడా సరఫరా కాదన్నారు. ఫలితంగా తీవ్ర మతిమరుపు తలెత్తవచ్చని వారు పేర్కొన్నారు. మెదడులోని రక్త నాళాల్లో (అథెరోస్క్లెరోసిస్‌) కొవ్వు పేరుకుపోవడానికి ముందు గుండె జబ్బు రోగుల్లో ఇలాంటి సమస్య ఏర్పడుతోంది.

మెదడులో అథెరోస్క్లెరోసిస్‌ ఏర్పడటానికి కొన్నేళ్ల ముందే ఈ ఇబ్బంది ఎలా ఉత్పన్నమవుతున్నాయన్న దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఆ గుట్టును ఇప్పుడు శాస్త్రవేత్తలు విప్పారు. గుండె జబ్బు, జన్యుపరమైన కారణాల వల్ల బీటా అమిలాయిడ్‌ పరిమాణం మూడింతలు కావడంతోపాటు మెదడులో ఐఎల్‌1 అనే ఇన్‌ఫ్లమేటరీ జన్యువు మోతాదు కూడా పెరుగుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. మెదడుకు అయ్యే గాయాలతోనూ ఆ అవయవానికి రక్త ప్రసరణ దెబ్బతింటుందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని