Updated : 25 Jan 2022 09:36 IST

NATO: తూర్పు ఐరోపాలో నాటో దళాల మోహరింపు

ఉక్రెయిన్‌కు ఈయూ దేశాల మద్దతు
తమ ప్రాదేశిక జలాల్లో రష్యా విన్యాసాలు జరుపుతోందని ఐర్లాండ్‌ తీవ్ర అభ్యంతరం
యుద్ధ క్రీడలకు ఇది సమయం కాదని హెచ్చరిక

బ్రసెల్స్‌: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. తూర్పు ఐరోపాపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూటమి బాల్టిక్‌ సముద్ర ప్రాంతంలో మరిన్ని యుద్ధ నౌకలు, విమానాలను మోహరిస్తోంది. అదనపు బలగాలనూ సిద్ధంగా ఉంచుతున్నట్లు ఆ కూటమి సోమవారం ప్రకటించింది. మరోవైపు..ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలవాలని ఈయూ దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయించారు. తమ ప్రాదేశిక జలాల్లో రష్యా యుద్ధ విన్యాసాలు జరుపుతోందని ఐర్లాండ్‌ ఆక్షేపించింది. ఉక్రెయిన్‌పై దాడి చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఆ విన్యాసాలు సమర్థనీయం కాదని హెచ్చరించింది. యుద్ధ క్రీడలకు ఇది సమయం కాదని పేర్కొంది. సైన్యం, ఆయుధ వ్యవస్థలతో సర్వసన్నద్ధంగా ఉండాలన్న తమ నిర్ణయం బాల్టిక్‌ సముద్ర ప్రాంతంలో యుద్ధ నిరోధక సామర్థ్యాన్ని పెంచుతుందని 30 దేశాల సైనిక కూటమి (నాటో) పేర్కొంది. రష్యాకు పొరుగునున్న లిథువేనియాకు యుద్ధ నౌకను, ఎఫ్‌-16 యుద్ధ విమానాలను పంపిస్తున్నట్లు డెన్మార్క్‌ ప్రకటించింది. బల్గేరియాకు స్పెయిన్, రుమేనియాకు ఫ్రాన్స్‌ యుద్ధ నౌకలు, ఫైటర్‌ జెట్స్‌ను పంపించనున్నట్లు తెలిపాయి.

‘అన్ని భాగస్వామ్య దేశాల భద్రత కోసం నాటో నిరంతరం చర్యలు తీసుకుంటుంది. తూర్పు ఐరోపా దేశాల భద్రతపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది’ అని నాటో సెక్రెటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బెర్గ్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలవాలని ఐరోపా సమాఖ్య(ఈయూ)కు చెందిన విదేశాంగ మంత్రులు నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.‘ఈయూ సభ్య దేశాలు కలిసికట్టుగా ఉన్నాయి. అమెరికాతో కలిసి ఉక్రెయిన్‌ వ్యవహారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మా సమైక్యతను చాటుకుంటున్నాం’ అని ఈయూ విదేశీ విధాన విభాగ అధినేత జోసెప్‌ బొరెల్‌ తెలిపారు. అయితే, అమెరికా మాదిరిగా ఉక్రెయిన్‌లోని ఈయూ రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కి రప్పిస్తారా? అని అడగగా.. అలా చేయబోమని స్పష్టం చేశారు. ఆ నిర్ణయంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో మాట్లాడతామన్నారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి కొంత మంది దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు సమీపంలో లక్ష మంది సైనికులను, యుద్ధ ట్యాంకులను, భారీ ఆయుధ వ్యవస్థలను రష్యా మోహరించడంతో ఏ క్షణంలోనైనా దాడి జరగవచ్చనే ఆందోళ వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

ఇది జల వివాద యుద్ధమా?

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా సైనిక మోహరింపులు యుద్ధానికి దారితీసినట్లయితే... ఆధునిక కాలంలో నీటి కోసం జరిగిన తొలి రణం ఇదే అవుతుందని పరిశీలకులు అంటున్నారు. మానవ చరిత్రలో అనేక యుద్ధాలు జల వనరుల కోసమే జరిగాయి. వాటిల్లో రష్యా, స్వీడన్‌ మధ్య ఉక్రెయిన్‌పై ఆధిపత్యం కోసం 1709లో జరిగిన యుద్ధం కూడా ఒకటి. ఆ తర్వాత 1783, 1856లలోనూ క్రిమియా దీవిని తన స్వాధీనంలో ఉంచుకోవడం కోసం రష్యా యుద్ధాలు చేసింది. 1991లో సోవియట్‌ యూనియన్‌ నుంచి విడిపోయే వరకూ ఉక్రెయిన్‌...రష్యాలో భాగంగానే ఉంది. 2014లో ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. చుట్టూ సముద్రం ఉండే ద్వీప ప్రాంతమైన క్రిమియాలో 25 లక్షల మంది ప్రజలు నివసిస్తుంటే అత్యధికులు రష్యన్లే. సోవియట్‌ యూనియన్‌ హయాంలో నిర్మించిన కెనాల్‌ ద్వారా క్రిమియా ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు 80శాతానికి పైగా తీరేవి. ఉక్రెయిన్‌లోని నదుల నుంచి ఆ నీటిని మళ్లించే వారు. అయితే, 2014 రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్‌ డెనిపర్‌ నదిపై ఆనకట్ట నిర్మించడంతో క్రిమియాకు నీటి సరఫరా తగ్గిపోయింది. క్రిమియా ప్రజలకు, సమీప నౌకా స్థావరానికి నీటి సరఫరా కోసం రష్యా భారీ మొత్తాల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. గత ఏడాది కరవు పరిస్థితులతో నీటి ఎద్దడి మరింత తీవ్రమైందని దిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలలో రష్యా చరిత్రను బోధించే ప్రొఫెసర్‌ కుమార్‌ సంజయ్‌ సింగ్‌ తెలిపారు. ‘‘రష్యా వ్యూహాత్మక సైనిక అవసరాలకు నల్ల సముద్ర(బ్లాక్‌ సీ) తీరంలో ఉండే క్రిమియా, సెవస్తొపోల్‌ అత్యంత ప్రధానమైనవి. రష్యా నౌకాస్థావరాలకు నీటి సరఫరా వీటి నుంచే జరుగుతుంది. అందువల్లే రష్యన్‌ నేతల దృష్టంతా ఎప్పుడూ క్రిమియాపైనే ఉంటుంది’’ అని ప్రొఫెసర్‌ సంజయ్‌ సింగ్‌ వివరించారు. తాజా ప్రతిష్టంభన కూడా క్రిమియాకు జలవనరులు సమకూర్చడం కోసమేనని ఆయన విశ్లేషించారు. 

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని