Updated : 27 Jan 2022 05:52 IST

బిహార్‌లో రైలుకు నిప్పంటించిన అభ్యర్థులు

 ఆర్‌ఆర్‌బీ-ఎన్‌టీపీసీ పరీక్ష రద్దు

రెండంచెల విధానంపై నిరసన గళం

అభ్యంతరాల పరిశీలనకు కమిటీ

దిల్లీ, పట్నా: రైల్వే నియామకాల కోసం రెండు అంచెల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించడాన్ని తప్పుపడుతూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ విధానం వల్ల ఎక్కువ విద్యార్హతలున్నవారు లబ్ధి పొందుతారని వారు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. బిహార్‌లోని గయలో నిరసనలకు దిగిన కొందరు ఉద్యోగార్థులు అక్కడి యార్డులో ఉన్న భభువా-పట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పంటించారు. రైలులో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. సీతామడీ రైల్వేస్టేషన్‌ వద్ద పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆందోళనల నేపథ్యంలో ‘నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ (ఆర్‌ఆర్‌బీ-ఎన్‌టీపీసీ)’ (సాంకేతికేతర ప్రాచుర్య విభాగాల) మొదటి స్థాయి (లెవెల్‌-1) పరీక్షలను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించింది. అభ్యంతరాలను, సందేహాలను పరిశీలించడానికి ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. అభ్యర్థులు rrbcommittee@railnet.gov.in  ఈ మెయిల్‌ ద్వారా తమ ఫిర్యాదులను, సూచనలను ఫిబ్రవరి 16 వరకు పంపించవచ్చు. కమిటీ తమ సిఫార్సులను మార్చి 4లోగా అందిస్తుంది.

ఇతర పరీక్షలు వాయిదా

కమిటీ నియామకం దృష్ట్యా ఫిబ్రవరి 15 నుంచి జరగాల్సిన సీబీటీ రెండో దశ పరీక్షలు, అదే నెల 23 నుంచి ప్రారంభం కావాల్సిన (సీఈఎన్‌ ఆర్‌ఆర్‌సీ 01/2019) తొలిదశ పరీక్షలు వాయిదా పడినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఎన్టీపీసీ పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తే తొలిదశ పరీక్షను రాసి అర్హత సాధించిన వారిని మోసం చేసినట్లే అవుతుందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ లెవెల్‌ 2 నుంచి లెవెల్‌ 6 వరకు 35,000 పోస్టుల కోసం 1.25 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఎక్కువ విద్యార్హతలున్నవారిని పరీక్ష రాయకుండా చట్టబద్ధంగా నిలువరించలేమని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ స్పష్టంచేశారు. ప్రయాగ్‌రాజ్‌లో అల్లర్లకు సంబంధించి దాదాపు వెయ్యిమంది గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు.

స్పందించిన రాహుల్‌, ప్రియాంక

 

భాజపా సర్కారు విధానాలపై పోరులో విద్యార్థులకు అండగా నిలుస్తానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. ఉద్యోగార్థుల అభ్యంతరాలను చర్చల ద్వారా పరిష్కరించాలని, వారి గొంతునొక్కే ప్రయత్నం చేయవద్దని ప్రభుత్వానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు.

 

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని