
‘విరాట్’కు విరామం
రాష్ట్రపతి అంగరక్షక దళ అశ్వానికి వీడ్కోలు
ఈనాడు, దిల్లీ: రాజ్‌పథ్‌లో బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకొంది. పెరేడ్ ముగిసిన అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరిగివెళ్లే సమయంలో... ఆయన అంగరక్షక దళంలో ముందువరుసలో ఉండే అశ్వం ‘విరాట్’కు కోవింద్‌తో పాటు ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు వీడ్కోలు పలకడం చూపరులను ఆకట్టుకొంది. ఈ అశ్వం విధుల నుంచి బుధవారం విరామం పొందుతున్న నేపథ్యంలో.. మోదీ ఆప్యాయంగా దాని తలపై నిమిరి వీడ్కోలు పలికారు. పక్కనే ఉన్న రాజ్‌నాథ్ దీని గురించి విశేషాలు చెబుతుంటే ఆయన నవ్వుతూ ఆలకించారు. విశేష సేవలందించిన విరాట్‌కు జనవరి 15న సైనిక దినోత్సవం సందర్భంగా ‘చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ కమాండేషన్’ పురస్కారాన్ని ప్రకటించారు. విశిష్ట సేవలు, సామర్థ్యాలతో ఈ గౌరవాన్ని పొందిన తొలి గుర్రం ఇదే! వరుసగా 13 సార్లు రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొన్న ఈ మేలుజాతి అశ్వానికి... పెరేడ్ ముగిసిన అనంతరం రాష్ట్రపతి అంగరక్షక దళం విధి నిర్వహణ నుంచి విరామం ప్రకటించింది. హనోవేరియన్ జాతికి చెందిన ఈ గుర్రాన్ని 2003లో రాష్ట్రపతి అంగరక్షక దళ కుటుంబంలో చేర్చారు. దీన్ని ప్రెసిడెంట్ బాడీగార్డ్ ఛార్జర్ అని కూడా పిలుస్తారు. గణతంత్ర పెరేడ్‌లో అత్యంత నమ్మకంగా వ్యవహరించే గుర్రంగా దీనికి పేరుంది. వయోభారం ఆవహించినప్పటికీ గత ఏడాది రిపబ్లిక్ డే ఉత్సవాల్లోనూ, బీటింగ్ రిట్రీట్‌లోనూ మంచి పనితీరు కనబరిచింది. భారత సైన్యంలో రాష్ట్రపతి అంగరక్షక దళానికి ప్రముఖ స్థానం ఉంది. వేల గుర్రాల సమూహం నుంచి మంచి ఎత్తు, వారసత్వం ఉన్న వాటిని ఇందుకోసం ఎంపిక చేస్తారు.