ఉక్రెయిన్‌తో ఉక్కిరిబిక్కిరి: బైడెన్, పుతిన్‌ల సత్తాకు పరీక్ష

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ల దీక్షాదక్షతలకు ఉక్రెయిన్‌ పరీక్ష పెడుతోంది. ఉక్రెయిన్‌ను కానీ, పూర్వ సోవియట్‌ కూటమి

Updated : 27 Jan 2022 11:01 IST

మాస్కో/వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ల దీక్షాదక్షతలకు ఉక్రెయిన్‌ పరీక్ష పెడుతోంది. ఉక్రెయిన్‌ను కానీ, పూర్వ సోవియట్‌ కూటమి సభ్య దేశాలను కానీ నాటోలో చేర్చుకోకూడదనీ, ఆ దేశాల్లో అమెరికా, నాటోలు మోహరించిన సేనలు, ఆయుధాలను ఉపసంహరించాలనీ పుతిన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి నాటో ససేమిరా అంటోంది. ఈ ప్రతిష్టంభన ఇలానే కొనసాగితే ప్రతీకార చర్యలు తీసుకోవాల్సి వస్తుందని రష్యా హెచ్చరిస్తోంది. దీంతో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేయబోతోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని బైడెన్‌ బలపరచడం లేదు. రష్యాను ఎదుర్కోవడానికి తమ సేనలను ఉక్రెయిన్‌కు పంపబోమని స్పష్టం చేస్తూనే, అవసరమైతే రష్యాకు పొరుగునున్న బాల్టిక్‌ దేశాల్లో దింపడానికి 8,500 మంది సైనికులను సిద్ధంగా ఉంచారు. రష్యాగానీ సైనిక చర్యకు దిగితే తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని బైడెన్‌ సమర్థంగా ఎదుర్కోగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

సమావేశం కానున్న సలహాదారులు 

అమెరికా, నాటోలు ఉక్రెయిన్‌కు సేనలను పంపకపోయినా ఆయుధ సహాయం అందించడం మొదలుపెట్టాయి. దీనివల్ల ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతాయంటూ ఆయుధాలను పంపడానికి జర్మనీ నిరాకరించడం నాటోలో భేదాభిప్రాయాలను సూచిస్తోంది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యుయేల్‌ మేక్రాన్‌ కూడా అమెరికా, రష్యాలు సంభాషణలు ప్రారంభించడం స్వాగతించాల్సిన అంశమే కానీ, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందనుకోవడం లేదన్నారు. రష్యా, ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాధినేతల సలహాదారులు త్వరలో పారిస్‌లో సమావేశమై క్రిమియా సమస్యపై చర్చలు జరపబోతున్నారు. తనపై రష్యా భారీ దాడికి దిగుతుందని ఉక్రెయిన్‌ భావించడం లేదు. సరిహద్దులో రష్యా లక్షమంది సైనికులను మోహరించినా పూర్తిస్థాయి దండయాత్రకు ఆ దళాలు ఏమాత్రం సరిపోవని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా అన్నారు. మరోవైపు- ఉక్రెయిన్‌లో నివసిస్తున్న తన పౌరులను భారత్‌ అప్రమత్తం చేసింది. ప్రతి భారతీయ పౌరుడు రాయబార కార్యాలయంలో రిజిస్టర్‌ చేసుకోవాలని కోరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని