పరస్పర సహకారంతోనే ప్రాంతీయ భద్రత పటిష్ఠం

ప్రాంతీయ భద్రతకు భారత్‌-మధ్య ఆసియా దేశాల మధ్య సహకారం అత్యంత అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. అఫ్గానిస్థాన్‌లోని పరిణామాల నేపథ్యంలో దీని ఆవశ్యకత ఇప్పుడు మరింత ఎక్కువగా ఉందన్నారు. భారత్‌-కజక్‌స్థాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, తజికిస్థాన్‌,

Updated : 28 Jan 2022 05:53 IST

ఉగ్రవాద కార్యకలాపాలకు  అఫ్గాన్‌ భూభాగం ఆశ్రయం ఇవ్వకూడదు
భారత్‌- మధ్య ఆసియా దేశాల సదస్సులో  ప్రధాని మోదీ పిలుపు

దిల్లీ: ప్రాంతీయ భద్రతకు భారత్‌-మధ్య ఆసియా దేశాల మధ్య సహకారం అత్యంత అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. అఫ్గానిస్థాన్‌లోని పరిణామాల నేపథ్యంలో దీని ఆవశ్యకత ఇప్పుడు మరింత ఎక్కువగా ఉందన్నారు. భారత్‌-కజక్‌స్థాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, తజికిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ (మధ్య ఆసియా దేశాల) తొలి సదస్సు గురువారం వీడియో విధానంలో జరిగింది. దీనికి నేతృత్వం వహిస్తూ మోదీ కీలక ప్రసంగం చేశారు. సమీకృత, స్థిరమైన పొరుగు దేశంగా ఉండాలనే భారత దార్శనికతకు మధ్య ఆసియా కేంద్ర బిందువుగా ఉందన్నారు. అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన... తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన ఆ దేశంలో మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడం, అక్కడి ప్రజలకు నిరంతరాయంగా సాయం అందించడం వంటి అంశాలను చర్చించాలన్నారు. ఏ దేశానికీ వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టేందుకు అఫ్గాన్‌ భూభాగం విద్రోహ శక్తులకు ఆశ్రయం కల్పించకూడదని ఆయన ఉద్ఘాటించారు. ‘‘ప్రాంతీయ భద్రత, స్థిరత్వం, శ్రేయస్సుకు పరస్పర సహకారం చాలా అవసరం. ప్రపంచాన్ని మార్చే శక్తిగల మన యువత ఆకాంక్షలను నెరవేర్చే దార్శనికత కావాలి. భారత్‌కు మధ్య ఆసియా దేశాలతో సుస్థిర సంబంధాలున్నాయి. ఇవి ఫలప్రదంగా 30 ఏళ్లు  పూర్తిచేసుకున్నాయి. మన దేశాల మధ్య అనుసంధానతను మరింత విస్తృతం చేసుకోవాలి. ఇప్పుడు మన ముందు మూడు లక్ష్యాలున్నాయి.

1) ప్రాంతీయ భద్రత, శ్రేయస్సుకు దేశాల మధ్య పరస్పర సహకారం అవసరం. దీన్ని పెంపొందించుకోవాలి.

2) దేశాల మధ్య సహకారానికి సమర్థవంతమైన విధానం ఉండాలి. భాగస్వామ్య దేశాల నడుమ పరస్పర చర్యల నిమిత్తం ఒక వేదిక ఏర్పాటుకు అది మార్గం సుగమం చేస్తుంది.

3) దేశాల మధ్య సహకారానికి ప్రతిష్టాత్మక మార్గసూచీని సిద్ధం చేసుకోవాలి. ప్రాంతీయ అనుసంధానత, సహకారం నిమిత్తం సమగ్ర విధానాన్ని అనుసరించడానికి ఇది వీలు కల్పిస్తుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సదస్సులో కజక్‌స్థాన్‌ అధ్యక్షుడు కస్యమ్‌ జొమార్ట్‌ టొకయెవ్‌, ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షుడు శవ్కాత్‌ మిర్జియోయెవ్‌, తజికిస్థాన్‌ అధ్యక్షుడు ఎమొమాలి రహ్మోన్‌, తుర్క్‌మెనిస్థాన్‌ అధ్యక్షుడు గుర్బాంగులి బెర్డిముహామెడోవ్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు సడైర్‌ జపరోవ్‌ పాల్గొన్నారు. మోదీ సూచించిన ‘వన్‌ ఎర్త్‌-వన్‌ హెల్త్‌’ విధానాన్ని నేతలు స్వాగతించారు.

భారతీయ విద్యా సంస్థలు, సినీ పరిశ్రమ మా వద్దకు రావాలి...

మహమ్మారి అనంతర ప్రపంచానికి అత్యంత విశ్వసనీయమైన, స్థిరమైన విశ్వ పంపిణీ విధానం అవసరమని నేతలు పేర్కొన్నారు. శాంతియుత, భద్రమైన, సుస్థిరమైన అఫ్గానిస్థాన్‌ కోసం తమ మద్దతు ఉంటుందన్నారు. అఫ్గాన్‌ ప్రజలకు తక్షణ మానవతా సాయాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఇరాన్‌లోని చాబహార్‌ రేవు ద్వారా ప్రాంతీయ అనుసంధానతను పెంచాలన్న భారత నిర్ణయాన్ని స్వాగతించారు. మధ్య ఆసియా దేశాల్లో విద్యా సంస్థలను నెలకొల్పాలన్న భారత ఆసక్తిని నేతలు స్వాగతించారు. ఈ విషయంలో తాము విస్తృత సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. భారతీయ సినీ నిర్మాతలు తమ దేశంలో సినిమా చిత్రీకరణ చేపట్టాలని మధ్య ఆసియా దేశాధినేతలు కోరారు. ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సి ఉందన్నారు.
మధ్య ఆసియా దేశాలతో చైనా సమావేశమైన రెండు రోజులకే ఈ సదస్సు జరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకొంది.

‘దిల్లీ డిక్లరేషన్‌’లో ముఖ్య అంశాలివీ...

సదస్సు అనంతరం నేతలు ‘దిల్లీ డిక్లరేషన్‌’ పేరిట నిర్ణయాలను వెలువరించారు.

* ఉగ్రవాద రహిత ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు సమగ్ర విధానంతో దాన్ని ఎదుర్కోవాలి.

* కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలను పరస్పరం గుర్తించాలి. తద్వారా పౌరులు తమ దేశాల్లో సులభంగా పర్యటించేందుకు వీలుంటుంది.

* ప్రపంచ ఆరోగ్య సవాళ్లు, మహమ్మారులకు సంబంధించి పారదర్శకమైన, వివక్షకు తావులేని, సమర్థవంతమైన అంతర్జాతీయ ప్రతిస్పందన అవసరం. తద్వారా ఔషధాలు, సంక్లిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు అందరికీ దరిచేరుతాయి.

* అఫ్గాన్‌ విషయంలో సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలి.

* విదేశాంగ, వాణిజ్య, సాంస్కృతిక శాఖల మధ్య చర్చలు, సంప్రదింపులను యథావిధిగా కొనసాగిస్తూనే... రెండేళ్లకోసారి దేశాధినేతలతో సదస్సు నిర్వహించాలి.


భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాలు మరింత బలోపేతం: మోదీ

దిల్లీ: భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మెక్రాన్‌ శుభాకాంక్షల సందేశం పంపినందుకు ప్రధాని మోదీ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకూ; శాంతిదాయక ఇండో-పసిఫిక్‌ ప్రాంతం ఆవిష్కరణకు ఫ్రాన్స్‌తో కలిసి కృషి చేస్తామన్నారు. ఈ మేరకు మోదీ గురువారం ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు