6 నెలలు కొవిడ్‌తో పోరాడి.. అనూహ్యంగా కోలుకున్న ‘యోధుడు’

ఊపిరితిత్తులు పాడై.. దాదాపు 6 నెలలు అపస్మారక స్థితిలో ఉన్న ఓ భారతీయ ఫ్రంట్‌లైన్‌ వారియర్‌ అనూహ్యంగా కొవిడ్‌ నుంచి కోలుకున్నారు.

Published : 28 Jan 2022 11:41 IST

దుబాయ్‌: ఊపిరితిత్తులు పాడై.. దాదాపు 6 నెలలు అపస్మారక స్థితిలో ఉన్న ఓ భారతీయ ఫ్రంట్‌లైన్‌ వారియర్‌ అనూహ్యంగా కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. అబుదాభీలోని ఎల్‌ఎల్‌హెచ్‌ ఆసుపత్రిలో ఓటీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన అరుణ్‌ కుమార్‌ ఎం.నాయర్‌ (38) కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ విధులను నిర్వర్తిస్తున్న సమయంలో గత ఏడాది జులైలో కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజులకే ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. నెలల తరబడి ‘ఎక్మో’ సపోర్ట్‌ ద్వారా చికిత్స అందించాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయనకు ‘కార్డియాక్‌ అరెస్ట్‌’ సహా అనేక తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. ఎట్టకేలకు అందరినీ ఆశ్చర్యపరుస్తూ నాయర్‌ ఇటీవల కోలుకోవడంతో ఆయన్ను జనరల్‌ రూమ్‌కు తరలించారు. కొవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా అరుణ్‌ కుమార్‌ అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు వీపీఎస్‌ హెల్త్‌కేర్‌ సంస్థ 66,519 డాలర్ల (దాదాపు రూ. 50 లక్షలు) ఆర్థికసాయాన్ని అందించింది. ఆయన కోలుకోవడం పట్ల యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఆయన మిత్రులు, సహచర ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.  ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు, పిల్లల చదువులకు అయ్యే ఖర్చును భరిస్తామని హెల్త్‌కేర్‌ గ్రూప్‌ ప్రకటించింది. తనకేదీ గుర్తు లేదని, మృత్యు కోరల్లోకి వెళ్లి తిరిగి వచ్చానని నాయర్‌ ఆనందంగా చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని