సంయమనానికి ప్రథమ ప్రాధాన్యం

ఉక్రెయిన్‌ సమస్యకు దౌత్య మార్గంలో సామరస్య పరిష్కారం కనుగొనడానికి పయత్నిస్తున్నామనీ, రష్యా కాదూ 

Published : 28 Jan 2022 11:11 IST

ఉక్రెయిన్‌ పట్ల రష్యా దూకుడుగా వెళ్తే చర్య తప్పదు: అమెరికా

మాస్కో/వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌ సమస్యకు దౌత్య మార్గంలో సామరస్య పరిష్కారం కనుగొనడానికి పయత్నిస్తున్నామనీ, రష్యా కాదూ కూడదంటే తీవ్ర ప్రతిచర్యకూ వెనుకాడమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని మాస్కోలోని అమెరికన్‌ రాయబారి జాన్‌ సలివన్‌ రష్యా ప్రభుత్వానికి అందించారు. కాగా, అమెరికా, నాటోలు తమ ప్రధాన డిమాండ్లను తోసిపుచ్చడం సమస్య పరిష్కారానికి తోడ్పడేలా లేదనీ, అయినా చర్చలకు తామూ సిద్ధంగానే ఉన్నామని రష్యా ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌ సరిహద్దులో లక్షమంది సైనికులను మోహరించడం ద్వారా రష్యా దండయాత్ర సంకేతాలిస్తోందని అమెరికా, నాటోలు భావిస్తుంటే, తనకు ఉక్రెయిన్‌ పై దాడి చేసే ఉద్దేశం లేదని రష్యా స్పష్టం చేసింది. అయితే, ఉక్రెయిన్‌ తో పాటు పూర్వ సోవియట్‌ కూటమి దేశాలను నాటోలో చేర్చుకోకూడదనీ, తన భూభాగానికి సమీపంలోని తూర్పు యూరప్‌ దేశాల్లో మోహరించిన సేనలను, క్షిపణులు తదితర ఆయుధాలను తక్షణం ఉపసంహరించాలని మాస్కో డిమాండ్‌ చేస్తోంది. దీనికి అమెరికా కూటమి ససేమిరా అనడం భవిష్యత్తుపై ఆశాభావానికి అంత దోహదం చేసేలా లేదని పెస్కోవ్‌ అన్నారు. అయినా తాము సయోధ్య చర్చలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. చర్చలు రష్యా, అమెరికాలు రెండింటికీ ప్రయోజనకరమన్నారు. ఏదిఏమైనా రష్యా అంతిమ వైఖరిని తమ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నిర్ణయిస్తారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్‌ లావ్రోవ్‌ వివరించారు. రష్యా డిమాండ్లను అమెరికా, నాటోలు అంగీకరించకపోతే సైనికంగా, సాంకేతికంగా ప్రతిచర్య తీసుకుంటామని పుతిన్‌ గతంలోనే హెచ్చరించారు.

మధ్యవర్తిత్వానికి ఫ్రాన్స్‌ సిద్ధం

ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారంలో దౌత్యానికి ఇంకా అవకాశం ఉందనీ, యుద్ధ ప్రమాదం కనిపిస్తున్నా చర్చలతో సమస్యను పరిష్కరించుకోవచ్చనీ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యుయేల్‌ మేక్రాన్‌ భావిస్తున్నారు. ఫ్రాన్స్‌ కూడా నాటోలో సభ్యదేశమే అయినా, మొదటి నుంచీ అమెరికా మాటకు డూడూ బసవన్నలా తలూపేది లేదన్నట్లు వ్యవహరిస్తోంది. అదీకాకుండా నిరుడు ఆస్ట్రేలియాకు జలాంతర్గాములు సరఫరాకు ఫ్రాన్స్‌ కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమెరికా అధ్యుక్షడు జో బైడెన్‌ రద్దు చేయించడం మేక్రాన్‌కు కోపకారణమైంది. రష్యాతో ఉద్రిక్తతల ఉపశమనానికి గతవారం మేక్రాన్‌ కొత్త ఈయూ భద్రతా పథకాన్ని ప్రతిపాదించగా, అమెరికాతో తమ సంబంధాలు దెబ్బతింటాయని కొన్ని ఈయూ దేశాలు వైముఖ్యం ప్రదర్శించాయి. ఏదిఏమైనా, రష్యా కనుక ఉక్రెయిన్‌ పై దండయాత్రకు దిగితే అమెరికాతో కలసి ఈయూ దేశాలు గట్టి ప్రతిచర్యకు దిగుతాయని మేక్రాన్‌ గతవారం ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని