Covid Vaccine: కొవిడ్‌ టీకాలకు పేటెంట్లు వద్దు!

కొవిడ్‌-19 టీకాలు, పరీక్షలు, చికిత్సలకు తాత్కాలికంగా మేధో హక్కుల నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చేందుకు మద్దతివ్వాలని

Updated : 29 Jan 2022 09:56 IST

 పేద దేశాల్లో వ్యాక్సిన్లుఇచ్చేందుకు ఇది అవసరం
 బ్రిటన్‌ ప్రధానికి శ్రీనాథరెడ్డి సహా పలువురు శాస్త్రవేత్తల విజ్ఞప్తి 

లండన్‌: కొవిడ్‌-19 టీకాలు, పరీక్షలు, చికిత్సలకు తాత్కాలికంగా మేధో హక్కుల నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చేందుకు మద్దతివ్వాలని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు బ్రిటన్‌ ప్రభుత్వాన్ని కోరారు. వ్యాక్సినేషన్‌ విషయంలో సమానత్వాన్ని సాధించేందుకు ఇది అవసరమని తెలిపారు. ఈ నిపుణుల్లో భారత సంతతి శాస్త్రవేత్తలూ ఉన్నారు. వర్ధమాన దేశాల్లో టీకాలు లభ్యమయ్యేలా చూడటానికి పేటెంట్‌ మినహాయింపు ఇవ్వాలని భారత్, దక్షిణాఫ్రికాలు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో ఒక ప్రతిపాదనను ప్రవేశపెట్టాయి. దీనికి ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు కె.శ్రీనాథ రెడ్డి (పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా), లండన్‌లోని క్వీన్‌ మేరీ యూనివర్సిటీకి చెందిన దీప్తి గురుదాసాని, స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీకి చెందిన బయో ఇంజినీర్‌ మను ప్రకాశ్, యూనివర్సిటీ కాలేజీ లండన్‌కు చెందిన ప్రొఫెసర్‌ అమితవ బెనర్జీ, ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన హరీశ్‌ నాయర్‌ సహా 320 మంది శాస్త్రవేత్తలు దీనికి మద్దతు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా టీకాల కవరేజీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. అల్ప, మధ్యాదాయ దేశాల్లో పెద్ద సంఖ్యల ప్రజలు టీకాలు పొందకుంటే కరోనాలో కొత్తగా ఆందోళనకర వేరియంట్లు వృద్ధి చెందడానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయని బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రతి పది మందిలో ఒకరు మాత్రమే టీకా పొందిన దక్షిణాఫ్రికా, బోత్సవానాలోనే ఒమిక్రాన్‌ వేరియంట్‌ మొదట వెలుగు చూసిందని వారు గుర్తు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని