CovidVaccine: అమ్మానాన్నలు చల్లగా.. పిల్లలూ చల్లగా..!

తల్లిదండ్రులు టీకాలు పొందడం వల్ల వారి పిల్లలకీ కొవిడ్‌-19 నుంచి గణనీయమైన రక్షణ లభిస్తుందని

Published : 30 Jan 2022 11:45 IST

తల్లిదండ్రుల వ్యాక్సినేషన్‌తో చిన్నారులకూ రక్షణ 

జెరుసలేం: తల్లిదండ్రులు టీకాలు పొందడం వల్ల వారి పిల్లలకీ కొవిడ్‌-19 నుంచి గణనీయమైన రక్షణ లభిస్తుందని తాజా అధ్యయనం తేల్చింది. దీంతో కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో టీకాల ప్రాధాన్యతను మరోసారి నిర్ధారించినట్లయింది. అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, ఇజ్రాయెల్‌లోని క్లాలిట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. అధ్యయనంలో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఆరోగ్య రికార్డు డేటాబేస్‌ను పరిశీలించారు. గత ఏడాది జూన్‌ నుంచి అక్టోబరు వరకూ ఇజ్రాయెల్‌లో డెల్టా వేరియంట్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో 76వేల ఇళ్లలో 1,81,307 మంది చిన్నారులను పరిశీలించారు. వీరిలో కొందరి తల్లిదండ్రులు ఫైజర్‌ మూడో డోసు టీకా పొందగా మిగతావారు రెండో డోసులే పొందారు. వ్యాక్సిన్‌ పొందని చిన్నారులకు.. వారి తల్లిదండ్రుల నుంచి లభించే పరోక్ష రక్షణనుశాస్త్రవేత్తలు విశ్లేషించారు. అందులో వెల్లడైన అంశాలివీ..

> వ్యాక్సిన్‌ పొందిన తల్లిదండ్రులకు వ్యాధి లక్షణాలతో కూడిన ఇన్‌ఫెక్షన్‌కు ఆస్కారం తక్కువ. కుటుంబంలోని ఇతరులకు వారు కొవిడ్‌ను వ్యాప్తి చేసే అవకాశం కూడా చాలా తక్కువ. 

>  మూడో డోసు పొందినవారికి ఇన్‌ఫెక్షన్‌ ముప్పు 20.8 శాతం మేర తగ్గింది. నాలుగు డోసులు పొందినవారికి కొవిడ్‌ ముప్పు 58.1 శాతం మేర తగ్గింది. 

అంతకుముందు ఆల్ఫా వేరియంట్‌ ఉద్ధృతంగా ఉన్నప్పుడు 2020 డిసెంబరు నుంచి 2021 మార్చి వరకూ టీకాలు పొందని 4 లక్షల మంది చిన్నారుల, కౌమారప్రాయులపై శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. అప్పట్లో రెండు డోసుల పొందినవారి పిల్లలకూ కొవిడ్‌ నుంచి రక్షణ లభించినట్లు తేల్చారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని