Election: ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. రెండో భార్య కావాలంటూ బ్యానర్లు..

ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రెండో భార్య కావాలంటూ నగరం మొత్తం బ్యానర్లు ఏర్పాటు చేశాడో వ్యక్తి. ఈ ఘటన 

Updated : 31 Jan 2022 12:48 IST

ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రెండో భార్య కావాలంటూ నగరం మొత్తం బ్యానర్లు ఏర్పాటు చేశాడో వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కొద్ది రోజుల్లో  ఔరంగాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు రానున్నాయి. రమేశ్‌ పాటిల్‌ అనే వ్యక్తి పోటీ చేయాలనుకున్నాడు. కానీ, అతనికి ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయాడు. ఎలాగైనా బరిలో నిలవాల్సిందేనని పట్టుదలతో ఉన్న రమేశ్‌.. ఓ ఉపాయం ఆలోచించాడు. తాను నిలబడలేకపోయినా.. తన కుటుంబంలో నుంచి ఒకరిని పోటీలో నిలపాలనుకున్నాడు. అయితే, సోదరుడు, సోదరి, తల్లిదండ్రులను కాదండోయ్‌.. రెండో పెళ్లి చేసుకుని వచ్చే భార్యను ఎన్నికల్లో పోటీ చేయించాలని సంకల్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రెండో భార్య కావాలంటూ ఏకంగా ఔరంగాబాద్‌ మొత్తం బ్యానర్లు కట్టించాడు. తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో అందులో పేర్కొన్నాడు. పెళ్లి అయి ఉంటే ఆ మహిళకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలనే షరతు కూడా విధించాడు. తన ఫోన్‌ నంబర్‌ సైతం బ్యానర్లలో అచ్చు వేయించాడు. ఇప్పుడు ఆయన ప్రకటనపైనే నగర జనం మొత్తం చర్చించుకుంటున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని