Supreme Court: రుణ ఒప్పందం నిబంధనల్ని ఎవరైనా పాటించాల్సిందే

రుణం మంజూరు ఒప్పందంలోని నిబంధనలు, షరతుల్ని అతిక్రమించేందుకు ఏ కంపెనీకి, చివరికి కేంద్ర

Updated : 01 Feb 2022 12:13 IST

ప్రభుత్వానికీ మినహాయింపు లేదు: సుప్రీం

దిల్లీ: రుణం మంజూరు ఒప్పందంలోని నిబంధనలు, షరతుల్ని అతిక్రమించేందుకు ఏ కంపెనీకి, చివరికి కేంద్ర ప్రభుత్వానికైనా వెసులుబాటు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) రుణ సాయంతో నిర్మిస్తున్న ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైల్‌ ప్రాజెక్టులో అనుబంధ పనుల కోసం మోంటెకార్లో కంపెనీ దాఖలు చేసిన బిడ్‌లను.. జైకా నిపుణుల కమిటీ తిరస్కరించడం సబబేనని చెప్పింది. ఈ విషయంలో మోంటెకార్లోకు అనుకూలంగా దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థ ‘నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ సుప్రీంను ఆశ్రయించింది. విచారించిన జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఏఎస్‌ బొపన్నల ధర్మాసనం.. దిల్లీ హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. జైకా కమిటీ నిర్ణయంలో ఎలాంటి పక్షపాతం కనిపించలేదని సోమవారం తీర్పు చెప్పింది. ‘‘జాతీయ ప్రాధాన్యమున్న బుల్లెట్‌ రైల్‌ ప్రాజెక్టు వివాదాస్పదం కారాదు. ఇది పూర్తిగా విదేశీ నిధులతో చేపడుతున్న ప్రాజెక్టు. రాయితీతో కూడిన రూ.లక్ష కోట్ల రుణంతో, సాంకేతిక సహకారంతో దీన్ని పూర్తిచేసేలా భారత్‌-జపాన్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది’’ అని సుప్రీం పేర్కొంది.

కరోనా నిబంధనల వల్ల ఎవరూ ఏమీ కోల్పోలేదు: సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపిన కేంద్రం 

కరోనా వ్యాక్సిన్ల సంబంధిత నిబంధనలతో కొంతమంది ఉద్యోగాలను, ఆహార పదార్థాలను కోల్పోవాల్సి వస్తోందనే ప్రచారాన్ని కేంద్రం తోసిపుచ్చింది. వివిధ మంత్రిత్వ శాఖలు, వేర్వేరు రాష్ట్రాలు జారీ చేసిన నిబంధనల వల్ల ఎవరూ ఏమీ కోల్పోలేదని సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ల ధర్మాసనానికి కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. క్లినికల్‌ పరీక్షల డేటా వెల్లడి, వ్యాక్సిన్‌ తప్పనిసరి చేయడానికి సంబంధించిన అంశాలపై విచారణలో భాగంగా ఆయన ఈ సమాచారాన్ని ఇచ్చారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదించారు. ప్రభుత్వ నిబంధనల వల్ల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆయన చెప్పారు. అలాంటిదేమీ లేదని మెహతా తోసిపుచ్చారు. నిర్దిష్ట కేసులేమైనా ఉంటే వాటిని సంబంధిత హైకోర్టులు విచారించవచ్చని ధర్మాసనం తెలిపింది. తుది విచారణకు తేదీ నిర్ణయిస్తామంది. 

నేవీ అధికారుల విషయంలో ఆ చర్యలు వద్దు 

శాశ్వత కమిషన్‌ మంజూరు కాని అధికారులను నౌకాదళ సేవల నుంచి పంపించివేసే చర్యల్ని చేపట్టవద్దని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై కేంద్రం సమాధానం తెలపాలని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం ఆదేశించింది. అధికారుల వినతులపై పునఃసమీక్ష జరపాలంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు అధికారులెవరినీ సర్వీసు నుంచి విడుదల చేయవద్దని స్పష్టంచేసింది. 

తేజ్‌పాల్‌ కేసు విచారణ నుంచి వైదొలగిన జడ్జీ 

అత్యాచారం కేసులో విచారణను రహస్యంగా జరపాలంటూ పాత్రికేయుడు తరుణ్‌ తేజ్‌పాల్‌ చేసిన అభ్యర్థనపై విచారణ నుంచి సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ వైదొలగారు. గతంలో తాను సుప్రీంకోర్టులో తేజ్‌పాల్‌ తరఫున వాదించానని చెబుతూ ఆయన సోమవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం దృష్టికి నివేదించారు. ఇటీవల జస్టిస్‌ లావు నాగేశ్వరరావు కూడా ఈ కేసు విచారణ నుంచి వైదొలగారు. 

హిందూ వారసత్వ చట్టం చెల్లుబాటుపై త్రిసభ్య ధర్మాసనం విచారణ 

హిందూ వారసత్వ చట్టం-1956లోని సెక్షన్‌ 15 చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం విచారించనుందని సుప్రీంకోర్టు తెలిపింది. వీలునామా రాయకుండా చనిపోయిన స్త్రీ, పురుషుల విషయంలో ఈ చట్టం వివక్షపూరితంగా ఉందని సుప్రీంలో పిటిషన్‌ దాఖలైంది. ఒక నిబంధన రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నించే అంశాలు దీనిలో ఉన్న దృష్ట్యా సుదీర్ఘ విచారణ జరపాల్సి ఉంటుందని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని