Corona Virus: క్వారంటైన్‌ కాలం ముగిసినా కొందరిలో క్రియాశీలంగానే వైరస్‌!

కొవిడ్‌-19 సోకిన వారు నిర్దిష్ట కాలంపాటు క్వారంటైన్‌లో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు

Updated : 01 Feb 2022 11:02 IST

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 సోకిన వారు నిర్దిష్ట కాలంపాటు క్వారంటైన్‌లో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆ తర్వాత కూడా కొందరి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందుతుంటుందని తాజా అధ్యయనం పేర్కొంది. ఇన్‌ఫెక్షన్‌ చివరి దశలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించనప్పటికీ వారిలో ఈ పరిస్థితి తలెత్తుతుందని వివరించింది. 

ఫ్రాన్స్‌కు చెందిన పాశ్చర్‌ ఇన్‌స్టిట్యూట్, బ్రెజిల్‌లోని సావో పాలో విశ్వవిద్యాలయం, ఆస్వాల్డో క్రజ్‌ ఫౌండేషన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. క్వారంటైన్‌ కాలం 14 రోజులు సరిపోతుందా? అది ముగిశాక బాధితుల్లో వైరస్‌ జాడ కనిపించదా అన్నది శాస్త్రవేత్తలు తెలుసుకోదలిచారు. ఇందులో భాగంగా వీరు గత ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు మధ్య కాలంలో 38 మంది రోగులను ప్రతివారం పర్యవేక్షించారు. ఆర్‌టీ క్యూపీసీఆర్‌ పరీక్షల్లో రెండు లేదా మూడుసార్లు ‘నెగెటివ్‌’గా తేలేవరకూ వీరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళలో పరిస్థితి భిన్నంగా ఉంది. వారిలో వైరస్‌ ఉనికి.. 70 రోజుల కన్నా ఎక్కువ కాలం సాగింది. ‘‘దీన్నిబట్టి కొవిడ్‌ సోకినవారిలో దాదాపు 8 శాతం మంది.. రెండు నెలల కన్నా ఎక్కువ కాలం పాటు వైరస్‌ను వ్యాప్తి చేస్తారని స్పష్టమవుతోంది. కొందరు రోగులు 71 నుంచి 232 రోజుల వరకూ పాజిటివ్‌గానే తేలుతున్నారు’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న పాలో మినోప్రియో తెలిపారు. క్వారంటైన్‌ కాలాన్ని తగ్గించాలనేవారికి ఈ పరిశోధన ఒక హెచ్చరిక సందేశమని వివరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని