Govt Of India: న్యాయమూర్తుల నియామకంలో కేంద్రం ప్రమేయం లేదు

దేశ అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం 34 జడ్జి పోస్టులకు గాను నలుగురు మహిళా న్యాయమూర్తులు, రాష్ట్రాల హైకోర్టుల్లో మొత్తం 1,098 జడ్జి పోస్టులకు

Updated : 04 Feb 2022 09:38 IST

దిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం 34 జడ్జి పోస్టులకు గాను నలుగురు మహిళా న్యాయమూర్తులు, రాష్ట్రాల హైకోర్టుల్లో మొత్తం 1,098 జడ్జి పోస్టులకు గాను 83 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు గురువారం రాజ్యసభలో తెలిపారు. రాజ్యాంగ ప్రకారం జరిగే వీరి నియామకాల్లో ఎలాంటి రిజర్వేషన్లు, ప్రభుత్వ ప్రమేయం ఉండవని చెప్పారు. సభలో అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. న్యాయమూర్తుల నియామక సిఫార్సుల్లో మహిళలకు, బీసీ.. ఎస్సీ.. ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కొలిజియంను తాము కోరుతున్నట్లు తెలిపారు. 

దేశంలో సామూహిక వలసలు లేవు : కేంద్రం

దేశంలో గత నెల కరోనా మహమ్మారి మూడోదశ మొదలైన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో సామూహిక వలసలు చోటుచేసుకొంటున్నట్లు మీడియాలో పాత చిత్రాలతో వచ్చిన కథనాలు వాస్తవం కాదని కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటుకు తెలిపింది. కరోనా కట్టడికి కొన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలు, మరికొన్ని వారాంతపు ఆంక్షలు అమలుచేశాయని పేర్కొంది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా కేంద్ర చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో 21 మానిటరింగ్‌ కేంద్రాలు పనిచేసినట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

8 ఏళ్లలో 23 సంస్థలు ప్రయివేటుపరం : కాంగ్రెస్‌

‘ఎనిమిదేళ్ల మోదీ పాలనలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వరంగ సంస్థ (పీఎస్‌యూ) కూడా ఏర్పడింది లేదు. ఉన్నవి 23 ప్రయివేటుపరం చేశారు. ఇదీ సర్కారు ఘనత. దేశంలో నిరుద్యోగం పెరిగింది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.134 కోట్ల జనాభాలో 84 శాతం ప్రజల ఆదాయం కరోనా మహమ్మారితో తగ్గిపోయింది. రాష్ట్రపతి ప్రసంగంలో వీటి ఊసే లేదు’ అంటూ గురువారం రాజ్యసభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యుడు రిపున్‌ బోరా ధ్వజమెత్తారు. మరో సభ్యుడు దిగ్విజయ్‌సింగ్‌        మాట్లాడుతూ.. దేశంలో ధనికులు, పేదల మధ్య తారతమ్యం పెరిగిందన్నారు. కరోనా కాలంలో సంపద పెరిగిన ధనికులపై ‘సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌’ విధించాలన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని