‘వైవాహిక అత్యాచారం’.. సామాజిక, చట్టపర చిక్కులతో ముడిపడి ఉంది: దిల్లీ హైకోర్టుకు కేంద్రం నివేదన

‘వైవాహిక అత్యాచారం’ అంశంపై కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టుకు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. 

Updated : 04 Feb 2022 10:27 IST

 

దిల్లీ: ‘వైవాహిక అత్యాచారం’ అంశంపై కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టుకు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. నాగరిక సమాజానికి మూలస్తంభం, పునాది అయిన మహిళల స్వేచ్ఛ, గౌరవం, హక్కులను పరిరక్షించేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నట్టు వెల్లడించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించే విషయమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహా సంబంధీకులందరితో అర్థవంతమైన, నిర్మాణాత్మక సంప్రదింపులు చేపట్టాల్సి ఉందని పేర్కొంది. సామాజిక, చట్టపరమైన చిక్కులతో ముడిపడిన ఈ అంశంపై సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ఏదైనా సాయం చేయగలదని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యానికి సంబంధించిన విచారణను వాయిదా వేయాలంటూ అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించి, దోషులను శిక్షించాలని కోరుతూ ఆల్‌ ఇండియా డెమోక్రాటిక్‌ విమెన్స్‌ అసోసియేషన్, ఆర్‌ఐటీ ఫౌండేషన్‌లు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశాయి. భారత శిక్షా స్మృతిలోని 375 నిబంధన నుంచి భర్తలకు మినహాయింపు ఇవ్వడాన్ని ఈ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ పిటిషన్లపై జస్టిస్‌ రాజీవ్‌ శక్‌ధర్, జస్టిస్‌ సి.హరిశంకర్‌ల ధర్మాసనం విచారణ చేపడుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని