US Raid: కుటుంబంతో సహా పేల్చేసుకున్న ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌

సిరియాలో అమెరికా దళాలు చుట్టుముట్టడంతో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) గ్రూప్‌ చీఫ్‌ అబూ ఇబ్రహీం అల్‌-హషిమీ అల్‌-ఖురేషీ తనను

Updated : 04 Feb 2022 10:52 IST

అమెరికా సైనికుల దాడిలో ధ్వంసమైన ఖురేషీ భవనం

అత్మేహ్‌: సిరియాలో అమెరికా దళాలు చుట్టుముట్టడంతో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) గ్రూప్‌ చీఫ్‌ అబూ ఇబ్రహీం అల్‌-హషిమీ అల్‌-ఖురేషీ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో ఖురేషీతో పాటు అతని కుటుంబంలోని మహిళలు, పిల్లలు దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌ గురువారం ప్రకటించారు. అమెరికా కమాండోల దాడిలో ఇస్లామిక్‌ స్టేట్‌ కీలక నేత అబూ బకర్‌ అల్‌ బగ్దాది హతమయ్యాక 2019 అక్టోబరు 31న ఖురేషీ అతని స్థానంలోకి వచ్చాడు. 

సిరియా- టర్మీ సరిహద్దుకు సమీపంలో అత్మేహ్‌ పట్టణ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఖురేషీ ఉన్నట్టు నిర్ధారించుకున్న అమెరికా ప్రత్యేక దళాలు మెరుపు దాడి చేశాయి. హెలికాప్టర్లతో ఆ భవనంపైకి దిగిన అమెరికా సైనికులకు, లోపలున్న ఉగ్రవాదులకు రెండు గంటలకు పైగా కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దాడుల్లో అమాయకులెవరూ చనిపోరాదని బైడెన్‌ ఆదేశించడం వల్లే వైమానిక దాడులు జరపలేదని తెలుస్తోంది. భవనంలో జరిగిన పేలుడులో తొలుత ఖురేషీతో పాటు ఆరుగురు పిల్లలు, నలుగురు మహిళలు సహా 13 మంది మరణించినట్టు వార్తలొచ్చాయి. అయితే ఖురేషీ జరిపిన పేలుడులో ఎంతమంది మృతిచెందారో కచ్చితంగా తెలియదని, మృతదేహాల డీఎన్‌ఏను విశ్లేషించాకే ఖురేషీ మృతిని ధ్రువీకరించినట్టు అమెరికా అధికారులు తెలిపారు. దాడుల అనంతరం  తిరిగి వెళ్తుండగా ఓ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తగా దాన్ని ధ్వంసంచేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని