Tsunami: సునామీ గుట్టు.. పసిగట్టేటట్టు!

భూకంపాల కారణంగా ఏర్పడే సునామీలను గుర్తించడంలో, తీర ప్రాంతాల వారిని అప్రమత్తం చేసి ప్రాణనష్టం తగ్గించే విధానాల 

Updated : 05 Feb 2022 10:38 IST

 పరిశోధన చేపట్టిన ఇన్‌కాయిస్‌ శాస్త్రవేత్తలు
 జీఎస్‌ఐ, ఇతర సంస్థలతో భాగస్వామ్యం
 ‘ఈనాడు’తో డైరెక్టర్‌ తుమ్మల శ్రీనివాస్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: భూకంపాల కారణంగా ఏర్పడే సునామీలను గుర్తించడంలో, తీర ప్రాంతాల వారిని అప్రమత్తం చేసి ప్రాణనష్టం తగ్గించే విధానాల రూపకల్పనలో భారత్‌ ప్రపంచ గుర్తింపు సాధించింది. అగ్నిపర్వతాలతో తలెత్తే రాకాసి సునామీలను మాత్రం పసిగట్టలేకపోతోంది. తరచుగా సునామీలను ఎదుర్కొనే జపాన్, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, ఇతరత్రా దేశాలదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రగతినగర్‌లోని ఇన్‌కాయిస్‌ శాస్త్రవేత్తలు సమస్యపై దృష్టిపెట్టారు. అండమాన్‌ నికోబార్‌ దీవుల సమీపంలోని బారెన్‌ దీవిపై పరిశోధనకు సిద్ధమైనట్లు డైరెక్టర్‌ తుమ్మల శ్రీనివాస్‌ కుమార్‌ ‘ఈనాడు’తో స్పష్టం చేశారు. 

2004 నాటి సునామీతో.. 

భూగర్భంలోని టెక్టానిక్‌ పలకలు రాపిడితో పైకి, కిందకి కదలడం కారణంగా భూకంపం రావడంతో 2004లో సునామీ ఏర్పడింది. హిందూ మహాసముద్రం సుమత్రాదీవుల వద్ద ఏర్పడ్డ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 9.1 - 9.3గా నమోదైంది. 30 మీటర్ల ఎత్తున రాకాసి అలలు 14 దేశాలకు చెందిన 2.3 లక్షల మందిని పొట్టనపెట్టుకున్నాయి. విపత్తు నుంచి పాఠం నేర్చుకున్న భారత ప్రభుత్వం 2007లో హైదరాబాద్‌ ఇన్‌కాయిస్‌లో సునామీ హెచ్చరికల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి హిందూ మహాసముద్రంతో తీరప్రాంతం కలిగిన 25 దేశాలకు ఇన్‌కాయిస్‌ సేవలందిస్తోంది. ఇప్పటివరకు 120కిపైగా భూకంపాలను గుర్తించి, వాటి కారణంగా ఏర్పడిన 10 సునామీల గురించి తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. లక్షలాది మంది మత్స్యకారులకు, నేవీ, సైన్యం, విపత్తు యాజమాన్య దళాలకు అనేక రకాలుగా సేవలందిస్తోంది.

గణాంకాలతో కచ్చిత విశ్లేషణ 

అండమాన్‌ నికోబార్‌ దీవుల చుట్టూ అగ్నిపర్వతాలు ఎప్పుడైనా బద్దలవ్వొచ్చు. ఇటీవల కాలంలో చాలా దేశాలకు అదే అనుభవం ఎదురవుతోంది. డిసెంబరు, 2018లో ఇండోనేసియాను ముంచెత్తిన సునామీ మరిన్ని పాఠాలు నేర్పింది. ‘‘అలలు తీరానికొచ్చే వరకు గమనించలేకపోయాం. ఇన్‌కాయిస్‌గానీ, ఆస్ట్రేలియా, జపాన్, ఇతరత్రా దేశాల్లోని హెచ్చరిక వ్యవస్థలు గానీ గుర్తించలేకపోయాయి. ఎందుకంటే.. భూకంపాలు సృష్టించే సునామీలను గుర్తించే సాంకేతికతే ప్రస్తుతం అందుబాటులో ఉంది. అగ్నిపర్వతాల కారణంగా ఏర్పడే వాటిని గమనించే విజ్ఞానం లేదు. ఈ నేపథ్యంలో జీఐఎస్‌ (జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా), పలు ఇతర సంస్థలతో కలిసి ఇన్‌కాయిస్‌ శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేపట్టింది’’ అని డైరెక్టర్‌ శ్రీనివాస్‌కుమార్‌ తెలిపారు. ‘‘అగ్నిపర్వతాలు ఏర్పడేందుకు అవకాశమున్న ప్రాంతాలను గుర్తించడం, వాటి ఉపగ్రహ చిత్రాల పరిశీలన, ఆయా ప్రాంతాల్లో సెన్సార్లు అమర్చి పొగ, నీటి తేట, ఉష్ణోగ్రత, అలల ఎత్తు, ఇతరత్రా అంశాలను నిరంతరం గమనించాల్సి ఉంది. వాటన్నింటినీ వేగంగా గుర్తించాలి. గణాంకాలను కచ్చితంగా విశ్లేషించి, సునామీ ఏర్పడే అవకాశాలను అంచనా వేయాలి. తీర ప్రాంతాలను హెచ్చరించి, సురక్షిత ప్రాంతాలకు తరలించే ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌)ని రూపొందించాలి.’’ అని శ్రీనివాస్‌కుమార్‌ వివరించారు. ‘‘గతంలోని అగ్నిపర్వతాల నుంచి, వారం క్రితం పసిఫిక్‌ మహాసముద్రంలోని టోంగో దీవిలో ఏర్పడ్డ సునామీ వరకు అన్నింటినీ విశ్లేషిస్తాం. దీవుల్లో లావా పెల్లుబికినప్పుడు, సముద్ర గర్భంలో విస్పోటనం సంభవించినప్పుడు, భూమి కుంగినప్పుడు, ఇతరత్రా పరిస్థితుల్లో ఏర్పడే సునామీల నుంచి రక్షించే విధానాలను రూపొందిస్తున్నాం’’ అని బృందంలోని శాస్త్రవేత్త అజయ్‌ వివరించారు.

- గడచిన 250 సంవత్సరాల్లో అగ్నిపర్వతాల కారణంగా చోటుచేసుకున్న మరణాల్లో 20-25 శాతం సునామీలతోనే సంభవించాయి.

- చరిత్రలోనే భారీ విధ్వంసం.. ఆగస్టు, 1883లో ఇండోనేసియాలోని క్రకటోవా దీవిలో అగ్నిపర్వతం బద్ధలైంది. భారీ ధ్వనులతో ఎగసిపడ్డ లావా సముద్రాన్ని కుదిపేసింది. అలలు 40 మీటర్లకుపైగా ఎత్తున ప్రయాణించి తీరప్రాంతాల్లోని దేశాల్లో 36 వేలమందిని మింగాయి. లావా పెల్లుబికినప్పుడు వెలువడిన శబ్ద తరంగాలు భూగోళాన్ని ఏడుసార్లు చుట్టాయి. సముద్రంలో వారం పాటు అలజడి తగ్గలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని