AP PRC: జన‘వర్రీ’ వేతనాలు.. ఏపీలో ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు కలపలేదు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలకు పోయి జనవరిలో ప్రభుత్వ ఉద్యోగులకు హడావుడిగా చెల్లించిన కొత్త పీఆర్సీ వేతనాల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి.

Updated : 05 Feb 2022 10:15 IST

చనిపోయిన, పదవీ విరమణ చేసిన వారికీ జీతాలు
 వెనక్కుకట్టండంటూ తాఖీదులు

ఈనాడు-అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలకు పోయి జనవరిలో ప్రభుత్వ ఉద్యోగులకు హడావుడిగా చెల్లించిన కొత్త పీఆర్సీ వేతనాల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. కొత్త పీఆర్సీ కొత్త స్కేళ్లతోనూ అమలు చేయగలమని నిరూపించుకునేందుకు ప్రయత్నించిన ఆర్థిక శాఖ అధికారులు ఇప్పుడు నాలుక కరుచుకునే పరిస్థితి ఏర్పడింది. జనవరి జీతాల్లో కోత పెట్టాల్సినవి కోత పెట్టలేదు. కొత్తగా జమ చేయాల్సినవి చేయలేదు. డిసెంబరు పే స్లిప్పును లెక్కలోకి తీసుకుని ఉద్యోగుల 2022 పీఆర్సీ మూలవేతనాన్ని లెక్కగట్టి కొత్త పీఆర్సీలో ఉన్న ఆయా భత్యాల ప్రకారం జనవరి నెల జీతాలు చాలామంది ఉద్యోగులకు చెల్లించేశారు. కొందరు ఇంకా రాని వాళ్లూ ఉన్నారు. ఇవ్వకూడని వారికి కూడా జీతాలు జమ చేసేశారు. డిసెంబరు నెల జీతం తీసుకుని.. ఆ తర్వాత చనిపోయిన వారికి కూడా జీతాలు జమయ్యాయి. చనిపోయిన పెన్షనర్లకూ పింఛన్లు చెల్లించేశారు. సస్పెండైన ఉద్యోగులు కొందరికి జీతాలు జమయ్యాయి. ఇప్పుడు మళ్లీ వాటిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఆర్థిక శాఖ అధికారులు ఒక నమూనాను రూపొందించి ఖజానాశాఖ అధికారులకు పంపారు. చనిపోయినా ఎవరెవరికి జీతాలు జమయ్యాయి? సెలవులో ఉండి, సస్పెన్షన్‌లో ఉండి పదవీ విరమణ పొంది కూడా జీతాలు జమై ఉంటే వారి వివరాలు ఉద్యోగి ఐడీ, సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీతో సహా నమోదు చేసి పంపాలని ఆదేశించారు. ఖజానా అధికారులు ప్రస్తుతం ఈ కసరత్తు చేస్తున్నారు. వీటికి సంబంధించి అన్ని సర్దుబాట్లు చేయాల్సి ఉంది.

ఇంకా ఎన్నెన్నో...

> ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంటు వారు ఏ నెలలో ఉద్యోగంలో చేరి ఉన్నారో ఆ నెలలోనే కలుస్తాయి. ఇలా జనవరిలో ఉద్యోగంలో చేరిన వారికి ఇంక్రిమెంటు కలపాల్సి ఉంది. అలా చేయకుండానే.. ఆ ప్రకారం భత్యాలు లెక్కకట్టకుండానే జనవరి జీతాలు చెల్లించేశారు.

> కొందరు ఉద్యోగులు జీఎస్‌ఎల్‌ఐ, జీపీఎఫ్‌ రుణాలు తీసుకుంటారు.  చాలా మంది 30 నెలల గడువులో ఆ రుణం వెనక్కు చెల్లిస్తారు. డిసెంబరులో ఆఖరి విడత చెల్లింపు ఉన్న వారు జనవరి నుంచి ఆ రుణ మినహాయింపు లేకుండా వేతనం వస్తుందని ఎదురుచూస్తున్నారు. డిసెంబరులో రుణ వాయిదా రివకరీ ఉండటంతో వారు పూర్తిగా చెల్లించేసినా అది పట్టించుకోకుండా జనవరిలోనూ ప్రభుత్వం కోత పెట్టి జీతం జమ చేసింది.

> కొంతమంది డిసెంబరులో సెలవులో ఉన్నారు. వారికి సెలవు మంజూరుకాక డిసెంబరు నెల జీతం జమ కాలేదు. ఆ తర్వాత వారికి సెలవు మంజూరైంది. సాధారణంగా వారికి జనవరిలో జీతం జమ కావాల్సి ఉంది. డిసెంబరులో వారికి జీతం రాకపోవడంతో జనవరి నెలలోనూ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు.

> చాలా మంది ఉద్యోగులు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉంటారు. ఏ నెలలో ఎంత మొత్తం చెల్లించాలనేది వారి అభీష్టాన్ని బట్టి ఉంటుంది. కొందరు డిసెంబరులో ఆదాయపు పన్ను కోత పెట్టుకోలేదు. వారికి ఇప్పుడు కూడా పన్ను మినహాయింపు చేయలేదు. ఆనక ఎక్కువ మొత్తంలో పన్ను కోత పెట్టుకోవాల్సి ఉంటుందని ఉద్యోగులు వాపోతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు