పాంగాంగ్‌పై చైనా అక్రమ వంతెన నిజమే...

దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవిడ్‌ టీకా ‘కొవాగ్జిన్‌’కు... 

Published : 05 Feb 2022 10:53 IST

లోక్‌సభకు వెల్లడించిన కేంద్రం

దిల్లీ: భారత్‌కు చెందిన 38 వేల కిలోమీటర్ల సరిహద్దు భూభాగం... గత ఆరు దశాబ్దాలుగా చైనా ఆధీనంలోనే ఉందని విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ లోక్‌సభకు తెలిపారు. ఆక్రమిత భూభాగంలోని పాంగాంగ్‌ సరస్సుపై డ్రాగన్‌ దేశం వంతెన నిర్మించడాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ ఆక్రమణను భారత్‌ ఎప్పుడూ అంగీకరించలేదని; జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు తమ దేశంలో అంతర్భాగమని ఇప్పటికే పలుమార్లు విస్పష్టం చేసిందన్నారు. వాస్తవాధీన రేఖను ఉభయ దేశాలు గౌరవించాలి; యథాతథ స్థితిని మార్చేందుకు ఏ దేశమూ ఏకపక్షంగా వ్యవహరించకూడదు; రెండు దేశాలు తమ మధ్య కుదిరిన ఒప్పందాలకు పూర్తిగా కట్టుబడి ఉండాలి- ఈ మూడు అంశాల ప్రాతిపదికగా తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభనపై భారత్‌ చైనాతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మంత్రి వివరించారు. 

 13 దేశాల్లో ‘కొవాగ్జిన్‌’ అత్యవసర వినియోగం

దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవిడ్‌ టీకా ‘కొవాగ్జిన్‌’కు... జనవరి 31 నాటికి మొత్తం 13 దేశాల్లో అత్యవసర వినియోగ అనుమతులు లభించినట్టు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. ఈ మేరకు ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌పవార్‌ శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘12-18 ఏళ్ల కౌమారులకు కొవాగ్జిన్‌ను అత్యవసరంగా అందించేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి డిసెంబరు 24నే అనుమతి వచ్చింది. ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా మండలి బృందం మాత్రం... 15-18 ఏళ్ల వయసువారికి దీన్ని అందించాలని సూచించింది’’ అని ఆమె పేర్కొన్నారు.

న్యాయవాదుల ఫీజులపై పరిమితులు కష్టం

కొందరు న్యాయవాదులు అధిక ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం వాటిపై పరిమితులు విధించడం కష్టమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. అయితే, అవసరంలో ఉన్నవారి కేసులను ఉచితంగా, లేదా తక్కువ ఫీజుకే వాదించేలా మంచి న్యాయవాదులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అధిక ఫీజులు, ఇబ్బందుల బెడద లేకుండానే అందరికీ న్యాయం అందించే అంశంపై తాను త్వరలో భారీ ప్రచారం చేపడతానన్నారు.

98 సవరణలు

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్‌సభలో విపక్ష సభ్యులు మొత్తం 98 సవరణలను; రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు మరో 80 సవరణలను ప్రతిపాదించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘పెగాసస్‌ నిఘా వ్యవహారం’పై సీపీఎం సభ్యుడు కరీం, కాంగ్రెస్‌ సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ ఇచ్చిన నోటీసులను రాజ్యసభ సెక్రటేరియట్‌ అంగీకరించలేదని వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని