Corona Virus: నెగెటివ్‌ అనుకోవద్దు..! పాజిటివ్‌ అయినా.. కొందరికి నెగెటివ్‌ ఫలితాలు

కరోనా మూడో దశలో వ్యాధి లక్షణాలు ఉన్న వారు పరీక్షలు చేయించుకుంటే కొందరికి నెగెటివ్‌ ఫలితం వస్తోంది. లక్షణాలు

Updated : 07 Feb 2022 10:15 IST

వైరస్‌ లేదన్న భావనతో యథేచ్ఛగా సంచారం
 ఫలితంగా ఇతరులకూ వ్యాప్తి
 లక్షణాలు కనిపిస్తే చికిత్స పొందాలంటున్న ఆరోగ్య శాఖ

ఈనాడు- హైదరాబాద్‌: కరోనా మూడో దశలో వ్యాధి లక్షణాలు ఉన్న వారు పరీక్షలు చేయించుకుంటే కొందరికి నెగెటివ్‌ ఫలితం వస్తోంది. లక్షణాలు తగ్గకపోవడంతో మూణ్నాలుగు సార్లు పరీక్షలు చేయిస్తే.. చివరకు పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ఇలా మొదటిసారి పరీక్షలో నెగెటివ్‌ ఫలితం వచ్చిన వారిలో ఎక్కువ మంది తమకు వైరస్‌ సోకలేదన్న భావనతో యథేచ్ఛగా సంచరిస్తున్నారు. ఫలితంగా.. వారు ఇతరులకు కరోనా సోకడానికి కారకులవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరూ హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొందుతూ మహమ్మారి కట్టడికి తమవంతుగా సహకరించాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచిస్తోంది. మూడో దశలో అత్యధికుల్లో లక్షణాలు ఉన్నా త్వరగానే కోలుకుంటున్నారు. అయితే, వీరు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైరస్‌ ఇతరులకు వ్యాపిస్తోంది. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల్లో 60-70 శాతం, ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో 70-80 శాతం కచ్చిత ఫలితం వస్తుంది. మిగిలిన శాతం నమూనాల్లో ఫలితాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోవచ్చనీ, నెగెటివ్‌ ఫలితం వచ్చినంత మాత్రాన వైరస్‌ లేదని చెప్పలేమనీ నిపుణులు చెబుతున్నారు. 

వేర్వేరు కారణాలతో ఇలా..

లక్షణాలు ఉన్న వారి నుంచి నమూనాల స్వీకరణలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, నమూనాలను సరైన మోతాదులో తీయకపోవడం, నమూనాలను ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షకు తరలింపులో జాప్యం, నిబంధనలు పాటించకపోవడం, పరీక్ష చేయడానికి ఎక్కువ రోజులు పట్టడం, పరీక్ష కిట్‌లో లోపాలుండడం తదితర కారణాలతో.. బాధితులకు వైరస్‌ ఉన్నా నెగెటివ్‌ ఫలితం వచ్చే అవకాశాలున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. లక్షణాలు ఉండి, పరీక్షల్లో ఫలితం నెగెటివ్‌గా వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో చికిత్స పొందాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. ఇంటింటి జ్వర సర్వేలో ఇదే విధానాన్ని అవలంబిస్తున్నామని, హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నామని, దీంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొంటున్నాయి.ప్రమాదకరం ఎప్పుడు.. 

వైద్యుల సూచనలు ఏంటీ?

జ్వరం

ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ ఫలితం వచ్చినా.. మూడు రోజులకు పైగా తీవ్రజ్వరం ఉంటే కరోనా కావచ్చేమోనని అనుమానించాలి. పారాసెటమాల్‌ మాత్రలు వేసుకుంటున్నా శరీరం స్పందించకుండా.. 101 డిగ్రీలు, ఆపైన జ్వరం వస్తుంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలి.

ఆక్సిజన్‌

పల్స్‌ ఆక్సిమీటర్‌లో రక్తంలో ఆక్సిజన్‌ శాతం 94 కంటే తక్కువగా చూపిస్తుంటే సందేహించాలి. గంట, గంటకు పరీక్షించాలి. రెండు మూడు గంటల్లో వేర్వేరుగా పరిశీలించినా.. 94 శాతం కంటే తక్కువగా చూపిస్తుంటే అది ప్రమాదానికి సంకేతమే. వైరస్‌ సోకిందా లేదా అన్న విషయాన్ని పక్కనపెట్టి అత్యవసర చికిత్సల కోసం ఆసుపత్రికి వెళ్లాలి.

రక్తపరీక్షలు 
జ్వరం తగ్గకుండా రక్తంలో ఆక్సిజన్‌ శాతం 94 కంటే ఎక్కువగా చూపిస్తున్న సందర్భాల్లో ఎల్‌డీహెచ్, ఫెరిటిన్, సీఆర్‌పీ తదితర కొన్ని రక్తపరీక్షలు చేయించాలి. ఇవి రక్తంలో ఇన్‌ఫ్లేమటరీని సూచిస్తాయి. వీటిలో ఫలితాలు సాధారణం కంటే రెట్టింపు నమోదైతే..  వెంటనే ఆసుపత్రిలో చేరి వైద్యసేవలు పొందాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని