AP PRC: ఇప్పుడు సీఎంకు ఎలా ధన్యవాదాలు చెబుతావు?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పీఆర్‌సీ సాధన సమితి నాయకుడు సూర్యనారాయణ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో నిరసనలు

Updated : 08 Feb 2022 10:28 IST

పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణపై సోషల్‌ మీడియాలో పలువురి ధ్వజం

ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పీఆర్‌సీ సాధన సమితి నాయకుడు సూర్యనారాయణ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పదో పీఆర్‌సీకి సంబంధించి గత తెదేపా హయాంలో 43శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించగా.. దానికి తెలంగాణ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పాలన్నారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో 30శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారని.. అదే ఏపీలో 27 శాతం ఐఆర్‌ ఇచ్చి ఫిట్‌మెంట్‌ను 23 శాతానికి తగ్గించేశారని తెలిపారు. ఇప్పుడు సూర్యనారాయణ ముఖ్యమంత్రికి ఎలా ధన్యవాదాలు చెబుతారంటూ ధ్వజమెత్తుతున్నారు. సూర్యనారాయణ వ్యాఖ్యల వివరాలివి. 


తెదేపా హయాంలో 43శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటనపై..

 ప్రేమతో ఇచ్చారనుకుంటున్నారా?..

‘43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. సంతోషం. ఎందుకిచ్చారు? మన ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న అవ్యాజ ప్రేమతో ఇచ్చారా? మన ఉద్యోగ సంఘాల నాయకుల పోరాట పటిమచూసి భయపడిపోయి ఇచ్చారా? అలాంటి భ్రమలు మీకు ఎవరికైనా ఉన్నాయా? అక్కడ (తెలంగాణలో) ఇచ్చారు కాబట్టి ఇక్కడా (ఆంధ్రప్రదేశ్‌లో) ఇవ్వాల్సి వచ్చింది. ఈ అంశంలో ధన్యవాదాలు చెప్పాల్సి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి చెప్పాలి. 


మంత్రుల కమిటీతో చర్చల అనంతరం తాజా వ్యాఖ్యలు ఇలా..

ఉద్యోగుల పాలిట శుభదినం.. గుడ్‌ డీల్‌

మా అసమ్మతిని తెలియజేసిన వెంటనే మా మనసు గుర్తెరిగి సమస్యలపై చర్చించేందుకు అతి తక్కువ వ్యవధిలో మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది. వారూ సహనంతో చర్చించారు. జగన్‌ ప్రభుత్వం ఎక్కువ ఫిట్‌మెంట్‌ ఇస్తుందన్న అంచనాలు ఉద్యోగుల్లో పెరగడం కూడా కొంత ఇబ్బందైంది. కొవిడ్, ఆర్థిక ఇబ్బందులు లేకపోయుంటే జగన్‌ ప్రభుత్వం ఉద్యోగుల అంచనాల్ని అందుకుని ఉండేదనే భావిస్తున్నాం. మేము మంత్రుల కమిటీ ఎదుట 13 డిమాండ్లు ఉంచితే 17అంశాల్లో మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించి మాతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది గుడ్‌డీల్‌ అనే భావిస్తున్నా. ఊహించినదానికంటే ఎక్కువే ఇవ్వాలని ఉన్నప్పటికీ కొవిడ్‌ పరిస్థితుల రీత్యా చేయలేకపోయామని సీఎం చెప్పారు. ఇకపై నెలకోసారి ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుతామని హామీనిచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని