Telangana News: కొవిడ్‌ మూడోదశ 42 రోజులే

రాష్ట్రంలో గతేడాది డిసెంబరు 28న మూడోదశ కొవిడ్‌ ఉద్ధృతి ప్రారంభం కాగా.. ఈ నెల 7 నాటికి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం ..

Published : 09 Feb 2022 09:59 IST

అధిక కేసుల నమోదుకు సమయం 28 రోజులు
మొదటి, రెండో దశలతో పోల్చితే స్వల్పం
వైద్యఆరోగ్యశాఖ తాజా నివేదికలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గతేడాది డిసెంబరు 28న మూడోదశ కొవిడ్‌ ఉద్ధృతి ప్రారంభం కాగా.. ఈ నెల 7 నాటికి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అంటే మూడోదశ ఉద్ధృతి 42 రోజులే కొనసాగింది. ఈమధ్య కాలంలో జనవరి 25న అత్యధికంగా 4,559 కేసులు నమోదయ్యాయి. అంటే అత్యధిక కేసుల నమోదుకు 28 రోజులు పట్టింది. ఒమిక్రాన్‌ రూపంలో వచ్చిన మూడోదశ ఎంత వేగంగా వచ్చిందో.. అంతే వేగంగా ముగిసిందని వైద్యశాఖ తాజా నివేదికలో వెల్లడించింది. తొలిదశ కరోనా ఉద్ధృతి 2020 మార్చి 2న ప్రారంభమై, 8 నెలల పాటు కొనసాగింది. ఆ దశలో అత్యధిక కేసులు అదే ఏడాది ఆగస్టు 25న 3,018 నమోదయ్యాయి. అంటే తొలిదశలో ఎక్కువ కేసుల నమోదుకు 177 రోజులు పట్టింది. రెండోదశను పరిశీలిస్తే.. 2021 మార్చి నుంచి 4 నెలలు విరుచుకుపడింది. ఆ దశలో ఏప్రిల్‌ 26న అత్యధికంగా 10,122 కేసులు ఒక్కరోజులోనే నమోదయ్యాయి. మూడోదశలో అత్యధిక కేసులు నమోదవడానికి 57 రోజుల సమయం తీసుకొందని వైద్యశాఖ తెలిపింది.

మూడోదశలో ముఖ్యాంశాలు
* మూడోదశలో జనవరి 28 నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆ రోజు గరిష్ఠంగా 3,877 కేసులు రాగా.. మంగళవారం(8న) 1,061 కేసులు నమోదయ్యాయి.
* ఇప్పటివరకూ కరోనా పాజిటివిటీ 3.1 శాతం కాగా, జనవరి 26న ఏకంగా 4.28 శాతం నమోదైంది. జనవరి 31 నుంచి పరిశీలిస్తే 3.51 నుంచి 2.01 శాతానికి పాజిటివిటీ తగ్గింది.
* 42 రోజుల మూడోదశలో 31 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అంటే రోజుకు 73,828 పరీక్షలు చేశారు. ఈ కాలంలో 98,066 కరోనా కేసులు నమోదవ్వగా.. సగటున రోజుకు 2,334 కేసులు నిర్ధారణ అయ్యాయి.
* మొత్తం 56,039 పడకలకు ఇప్పటివరకూ 4 శాతమే నిండాయి.
* జనవరి 21 నుంచి ఇప్పటివరకూ 1.33 కోట్ల ఇళ్లలో జ్వర సర్వే జరిగింది. 5.67 లక్షల మందికి లక్షణాలను గుర్తించగా.. 5.48 లక్షల మందికి ఔషధ కిట్లను అందించారు. గతంలో రెండోదశ ఉద్ధృతిలోనూ జ్వర సర్వే నిర్వహించి, 15.72 లక్షల ఔషధ కిట్లను అందజేశారు.
* 265 పాఠశాలలు, కళాశాలల్లో ఈనెల 1 నుంచి 9,926 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, కేవలం ఇద్దరిలో మాత్రమే వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
* మూడోదశలో టీకా తీసుకోనివారు 2.8 శాతం మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు.
* రాష్ట్రంలో నిజామాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్‌ మినహా అంతటా నూరు శాతం తొలిడోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు