భర్తలు జైళ్లలో.. భార్యలు బరిలో: యూపీ ఎన్నికల్లో వైచిత్రి ఇది

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థులేమో వివిధ కారణాల 

Updated : 10 Feb 2022 10:44 IST


 

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థులేమో వివిధ కారణాల వల్ల జైళ్లలో ఉండగా వారి భార్యలు, కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయోధ్య జిల్లాలోని గోసాయిగంజ్‌ స్థానం నుంచి ఇంద్రదేవ్‌ తివారీ అలియాస్‌ ఖుబ్బు తివారీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరఫున గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఫోర్జరీ నేరంలో గత ఏడాది న్యాయస్థానం ఆయనకు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఇంద్రదేవ్‌ తివారీ భార్య ఆర్తీ తివారీని భాజపా రంగంలోకి దింపింది. ప్రయాగరాజ్‌కు చెందిన అతిక్‌ అహమ్మద్‌ అలహాబాద్‌ పశ్చిమస్థానం నుంచి 1989, 1991, 1993లో స్వతంత్ర అభ్యర్థిగా, 1996లో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా, 2002లో అప్నాదళ్‌ అభ్యర్థిగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో సమాజ్‌వాది టికెట్‌పై ఫుల్పుర్‌ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అతిక్‌ అహమ్మద్‌ వివిధ నేరారోపణలపై ప్రస్తుతం జైలులో ఉన్నందున అతని భార్య శైస్టాపర్వీన్‌ ప్రయాగరాజ్‌ పశ్చిమ స్థానం నుంచి మజ్లిస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు తెలిసింది. సమాజ్‌వాది ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గాయత్రీ ప్రజాపతి అత్యాచారం కేసులో కటకటాలపాలయ్యారు. ఆయన భార్య మహారాజి ప్రజాపతికి అమేఠీ టికెట్‌ను సమాజ్‌వాది పార్టీ కేటాయించింది. అలీగఢ్‌ నగర స్థానం నుంచి 2017 ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా గెలుపొందిన సంజీవ్‌ రాజా పోలీసుపై దాడికి గాను రెండేళ్ల జైలుశిక్ష పడింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన భార్య ముక్తా భాజపా అభ్యర్థినిగా ఉన్నారు. కైరానా అసెంబ్లీ నియోజకవర్గ ఎస్పీ ఎమ్మెల్యే నాహిద్‌ హసన్‌ గ్యాంగ్‌స్టర్‌ చట్టం కింద జైలులో ఉన్నారు. సమాజ్‌వాది పార్టీ మళ్లీ ఆయనకు టికెట్‌ ఖరారు చేసింది. నామినేషన్‌ చెల్లుబాటు అయినప్పటికీ జైలులోనే ఉండటంతో ఆయన తరఫున సోదరి ఇక్రా ప్రచారం చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని