అమానుషం.. పుట్టే బిడ్డను అబ్బాయిగా మారుస్తానంటూ.. గర్భిణి తలకు మేకు!

కచ్చితంగా అబ్బాయి పుట్టాలంటే నదుటికి మేకు కొట్టుకోవాలని ఓ గర్భిణికి సూచించి, ఆమెను ప్రాణాపాయంలో పడేసిన నకిలీ బాబా

Updated : 11 Feb 2022 09:34 IST

పెషావర్‌: కచ్చితంగా అబ్బాయి పుట్టాలంటే నుదుటికి మేకు కొట్టుకోవాలని ఓ గర్భిణికి సూచించి, ఆమెను ప్రాణాపాయంలో పడేసిన నకిలీ బాబా కోసం పాకిస్థాన్‌లోని పెషావర్‌ నగర పోలీసులు గాలిస్తున్నారు. పెషావర్‌కు చెందిన బాధితురాలికి ఇప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. ఆమె ప్రస్తుతం గర్భిణి. మరోసారి అమ్మాయే పుడుతుందని చాలా భయపడేది. మగబిడ్డ పుట్టకపోతే వదిలేస్తానని ఆమె భర్త బెదిరించడం ఇందుకు ప్రధాన కారణం. నాలుగో కాన్పులోనూ అమ్మాయి పుడుతుందన్న భయంతో క్షణమొక యుగంలా గడుపుతున్న ఆ మహిళ.. పరిష్కారం కోసం తెగ వెతికింది. ఎవరో చెప్పగా.. ఓ బాబా దగ్గరకు వెళ్లింది. ఆ నకిలీ బాబా ఓ అసాధారణమైన, ప్రాణాంతకమైన సలహా ఇచ్చాడు. నదుటిపై పదునైన మేకును దించితే.. గర్భంలో అమ్మాయి ఉన్నా అబ్బాయే పుడతాడని నమ్మబలికాడు.

అతడు చెప్పినట్టే చేసింది ఆ మహిళ. తలలోకి రెండు అంగుళాల మేకు దిగగానే నొప్పితో విలవిల్లాడిపోయింది. ఆ మేకును బయటకు లాగేందుకు ఆమె కుటుంబసభ్యులు విఫలయత్నం చేశారు. హుటాహుటిన బాధితురాలిని పెషావర్‌లోని లేడీ రీడింగ్‌ ఆస్పత్రికి తరలించారు. న్యూరాలజిస్ట్‌ హైదర్‌ సులేమాన్‌ ఆమెకు చికిత్స చేశారు. ఆ మేకు పుర్రెలోకి చొచ్చుకెళ్లిందని, కానీ మెదడును తాకలేదని చెప్పారు. ఎందుకిలా చేశారో చెప్పడంతో షాక్‌కు గురయ్యానన్నారు సులేమాన్‌. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. అయితే.. మహిళ తలలో మేకు ఉన్న ఎక్స్‌రే ఫొటో వైరల్‌ అయింది. ఇది అధికారుల దృష్టికి వెళ్లగా పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నకిలీ బాబా కోసం గాలిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని