Mobile App: 13 ఏళ్ల బాలిక యాప్‌కు రూ.50 లక్షల నిధులు

పాఠశాలలో వేధింపుల (బుల్లీయింగ్‌) నివారణే లక్ష్యంగా యాప్‌ను రూపొందించిన 13 ఏళ్ల బాలిక ఏకంగా రూ.50 లక్షల నిధుల ప్రతిపాదనను సొంతం చేసుకుంది. 

Updated : 14 Feb 2022 11:02 IST

పాఠశాలలో వేధింపులపై పోరాడేందుకు రూపొందించిన జాలీ

గురుగ్రామ్‌: పాఠశాలలో వేధింపుల (బుల్లీయింగ్‌) నివారణే లక్ష్యంగా యాప్‌ను రూపొందించిన 13 ఏళ్ల బాలిక ఏకంగా రూ.50 లక్షల నిధుల ప్రతిపాదనను సొంతం చేసుకుంది. ఈ మేరకు గురుగ్రామ్‌లోని ద పాత్‌వేస్‌ పాఠశాలలో చదివే జాలి.. విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు, నిపుణుల సహాయంతో ది యాంటీ బుల్లీయింగ్‌ స్క్వాడ్‌ (ఏబీఎస్‌) ఆన్‌లైన్‌ వేదికను మూడేళ్ల క్రితం రూపొందించింది. దీనిద్వారా సుమారు 100 పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన 2,000 మంది విద్యార్థులు ప్రయోజనం పొందినట్లు ఆమె తెలిపింది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని ‘కవచ్‌’ పేరుతో మొబైల్‌ యాప్‌ను సైతం రూపొందించింది. దీని సహాయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు వేధింపులపై అజ్ఞాతంగా ఫిర్యాదు చేయవచ్చు. ఫలితంగా సంబంధిత పాఠశాలలు, కౌన్సిలర్లు జోక్యం చేసుకోవడానికి వీలవుతుంది. ఈ యాప్‌ తయారీకి కారణమైన అయిదేళ్ల క్రితం జరిగిన ఘటనను వివరిస్తూ.. ‘‘ఆ రోజు బాలిక వేధింపులకు గురవడం ఇప్పటికీ నాకు గుర్తు. ఆమె చాలా భయపడింది. 

నిస్సహాయంగా ఉండిపోయింది’’ అని షార్క్‌ ట్యాంక్‌ ఇండియా రియాల్టీ షోలో మాట్లాడుతూ జాలీ వెల్లడించింది. ఆమె ఆలోచన ఈ షోలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కురాలిగా పేరు తేవడంతోపాటు రూ.50 లక్షల నిధుల ప్రతిపాదనను సాధించి పెట్టింది. ‘‘నా ఆలోచన ష్కార్క్‌ ట్యాంక్‌లోని న్యాయ నిర్ణేతలకు బాగా నచ్చింది. వారిలో ఇద్దరు నా అప్లికేషన్‌ను మరింతగా విస్తరించేందుకు వీలుగా రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు’’ అని జాలీ చెప్పింది. షార్క్‌ ఇండియా రియాల్టీ షోలో (భారత్‌లో) పాల్గొనేందుకు ఇప్పటివరకు 50,000 మంది దరఖాస్తు చేయగా.. 198 ఎంపికయ్యారు. ఇక జాలీ ఆలోచనకు ఆకర్షితులై రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన వారిలో పీపుల్స్‌ గ్రూప్‌ (షాదీ డాట్‌ కామ్‌) సీఈవో అనుపమ్‌ మిట్టల్, బోట్‌ సహ వ్యవస్థాపకుడు అమన్‌ గుప్తా ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని